Manufacturing Hub: చైనా తర్వాత ప్రపంచంలో తయారీ కేంద్రంగా మారాలని భారత్ భావిస్తోంది. విదేశీ కంపెనీలు స్థితిస్థాపకతను పెంపొందించడానికి తమ తయారీ, సరఫరా గొలుసు వ్యూహాలను అనుసరిస్తున్నందున.. ఈ దశాబ్దంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడానికి భారతదేశానికి ఒక ప్రత్యేకమైన అవకాశం లభించనుంది. దీనికి ముందు కరోనా, యూఎస్-చైనా ట్రేడ్ వార్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఒక మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. చాలా కంపెనీలు తమ తయారీని చైనా నుంచి ఇతర ప్రాంతాలకు మార్చాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో తరువాతి తయారీ హబ్ గా భారత్ ఎంపికైంది. అయితే.. తయారీ రంగంలో సవాళ్లను అధిగమించడానికి భారత్ ముందుగా కొన్ని సమస్యలను పరిష్కరించాలని గోద్రెజ్ & బోయ్స్ ఛైర్మన్ జంషీద్ నౌరోజీ గోద్రెజ్ అభిప్రాయపడ్డారు.

తయారీకి అత్యంత సమర్థవంతమైన కర్మాగారాలు అవసరం. దీనికి తోడు వ్యాపారం సజావుగా సాగాలంటే సరఫరాదారులు, తయారీదారుల మధ్య పరస్పర ఆధారితాలు అవసరం, దీనికి తోడు సరఫరా గొలుసు సమర్థవంతంగా ఉండటం చాలా కీలకమని నౌరోజీ గోద్రెజ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనే కాక దీనిపై స్థానిక గ్రామ స్థాయి వరకు అవగాహన అవసరమని అన్నారు.
ఈ క్రమంలో గోద్రేజ్ వియత్నాం తయారీ నమూనా గురించి మాట్లాడుతూ.. భారత్ కంటే వియత్నాం ముందుకెళ్లడానికి కారణాన్ని వెల్లడించారు. ఒక పరిశ్రమ ప్రవేశించినప్పటి నుంచి అది కార్యరూపం దాల్చేంత వరకు స్థానిక సంస్థలు, ప్రభుత్వం సహాయం అందించటమే కారణమని తెలిపారు. వియత్నాంలో ఇండస్ట్రియల్ పార్క్ అధికారులు వాస్తవానికి అవసరమైన ప్రతి రకమైన క్లియరెన్స్, అనుమతిని వ్యాపారవేత్త తరఫున దగ్గరుండి చూసుకుంటారు. ఇది అక్షరాలా వన్ స్టాప్ షాప్. అన్ని అనుమతులూ ఒకే చోట అందించటం అనే అంశం సమర్థతకు చాలా కీలకం. భారత్ ఈ కోణాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోలేదని గోద్రేజ్ వెల్లడించారు.
టెక్, దుస్తుల తయారీ విషయానికి వస్తే వియత్నాం ప్రపంచంలోని ప్రముఖ తయారీ కేంద్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రఖ్యాత Nike, Adidas, Samsung వంటి కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లు అక్కడ తమ తయారీ యూనిట్లను కలిగి ఉన్నాయి.
'మేక్ ఇన్ ఇండియా 2.0' ఇప్పుడు 27 రంగాలపై దృష్టి సారిస్తోంది. ఇందులో 15 తయారీ, 12 సేవా రంగాలు ఉన్నాయి. ఫర్నిచర్, అగ్రి ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్, రోబోటిక్స్, టెలివిజన్స్, అల్యూమినియం రంగాలు ఉన్నాయి, ప్రస్తుతం భారత తయారీ రంగం దేశ జీడీపీలో 15-16 శాతం వాటా కలిగి ఉంది. రానున్న సంవత్సరాల్లో దీనిని 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications