భారత్ - జర్మనీల మధ్య రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. దాదాపు 8 బిలియన్ డాలర్ల (సుమారు 66,000 కోట్ల రూపాయలు) విలువైన భారీ జలాంతర్గామి ఒప్పందం రాబోయే మూడు నెలల్లో ఖరారు కానుందని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ బుధవారం ప్రకటించారు. జర్మనీలోని కీల్ నగరంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిపిన కీలక చర్చల అనంతరం ఈ విషయం వెల్లడైంది.
ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆరు జలాంతర్గాములను నేరుగా భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. ఇది India రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటిగా నిలవడమే కాకుండా, జర్మనీ తన జలాంతర్గామి సాంకేతికతను యూరోపియన్ దేశం కాని ఒక దేశానికి బదిలీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం జర్మనీకి చెందిన 'థైసెన్‌క్రూప్ మెరైన్ సిస్టమ్స్' (TKMS), భారత ప్రభుత్వ రంగ సంస్థ 'మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్' కలిసి పని చేయనున్నాయి. తన పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా టీకేఎంఎస్ షిప్‌యార్డ్‌ను సందర్శించి, టైప్ 212 రకానికి చెందిన జలాంతర్గామి సామర్థ్యాలను పరిశీలించారు.
ఈ చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని, రాబోయే మూడు నెలల్లో అధికారికంగా సంతకాలు పూర్తవుతాయని పిస్టోరియస్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారతదేశంలో పర్యటించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ ప్రతిపాదన గురించి చర్చించారు. అది ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
కేవలం జలాంతర్గాములకే పరిమితం కాకుండా, ఇరు దేశాలు రక్షణ పారిశ్రామిక సహకార రోడ్‌మ్యాప్‌పై కూడా సంతకాలు చేశాయి. దీనివల్ల భవిష్యత్తులో సైనిక పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి మార్గం సుగమం కానుంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారం కోసం కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు ఇరు దేశాల సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, ఉమ్మడి శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణంలో కొత్త అవకాశాలను కల్పిస్తాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రాజ్‌నాథ్ సింగ్ తన పర్యటన గురించి స్పందిస్తూ.. జర్మనీతో రక్షణ సహకారం బలపడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడంలో ఈ కొత్త జలాంతర్గాములు భారత నౌకాదళానికి కొండంత అండగా నిలవనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి పెద్దపీట వేయడమే కాకుండా, రక్షణ రంగంలో భారతదేశం స్వయంసమృద్ధి సాధించే దిశగా మరో అడుగు ముందుకు పడింది.


Click it and Unblock the Notifications
