అందుకే తగ్గాయి.. 5 ఏళ్ల కనిష్టానికి క్రూడాయిల్ దిగుమతులు
క్రూడాయిల్ దిగుమతులు జూన్ మాసంలో అయిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్, లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగిన విషయం తెలిసిందే. జూన్‌లో అన్-లాక్ ప్రారంభం అయినప్పటికీ ఆంక్షలు కొనసాగాయి. దీంతో రవాణా, తద్వారా చమురు వినియోగం తగ్గి, దిగుమతులపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ డేటా ప్రకారం క్రూడాయిల్ దిగుమతులు ఏడాది ప్రాతిపదికన గత నెలలో 19 శాతం క్షీణించి 13.68 మిలియన్ టన్నులకు పరిమితమైంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) ప్రకారం దిగుమతులు క్షీణించడం ఇది వరుసగా మూడో నెల.

దిగుమతి అవసరం అందుకే తగ్గింది
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో చమురు డిమాండ్ ఇంకా కోలుకోలేదని, దేశంలో మళ్లీ డిమాండ్ పెరగడానికి కాస్త సమయం పడుతుందని యూబీఎస్ అనలిస్ట్ గియోవాన్ని స్టానోనో అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎక్కువ చమురు దిగుమతులు, ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా వినియోగం తగ్గిపోవడంతో క్రూడ్ ట్యాంక్స్ ఇంకా నిండి ఉన్నాయని, దీంతో ప్రస్తుతం దిగుమతి అవసరాన్ని తగ్గించాయని చెబుతున్నారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు.

పడిపోయిన ఇంధన ఉత్పత్తి ఎగుమతులు
ఇంధన డిమాండ్ జూన్ నెలలో 7.8 శాతం పడిపోయిందని, కరోనా కేసులు పెరగడంతో పాటు రిటైల్ ధరలు పెరగడం డిమాండ్ పైన ప్రభావం చూపించాయని చెబుతున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు వినియోగం తగ్గి, డిమాండ్ పడిపోయే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు, చమురు ఉత్పత్తి ఎగుమతులు 6 శాతం మేర పడిపోయాయి. ఆగస్ట్ 2019 తర్వాత మొదటిసారి పడిపోయాయి. ప్రధానంగా డీజిల్ ఎగుమతులు క్షీణించాయి. గత ఏడాది ఏప్రిల్ నుండి కనిష్టానికి డీజిల్ ఎగుమతులు పడిపోయాయి.

రిఫైనరీస్ మెయింటెనెన్స్, షట్ డౌన్
డీజిల్ షిప్‌మెంట్స్ 5.7శాతం తగ్గి 2.09 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఓ వైపు నిల్వలు పెరిగిపోవడం, వినియోగం ఇంకా పుంజుకోకపోవడంతో కొన్ని రిఫైనరీలు 2020 క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్‌లో మెయింటెనెన్స్, షట్ డౌన్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. తమ రిఫైనరీలలో ఎప్పటికంటే తక్కువ సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగుతాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. స్థానిక, విదేశీ ఇంధన డిమాండ్ తగ్గుతుందని అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications