GDP growth: మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనా 4.5 శాతం
భారత వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో 4.5 శాతంగానే ఉండవచ్చునని ఇండిపెండెంట్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యవసాయం, ప్రభుత్వ వ్యయాలు స్వల్పంగా పెరగడంతో ఈ క్వార్టర్‌లో వృద్ధి రేటు గత క్వార్టర్‌తో పోలిస్తే స్టడీగా ఉండవచ్చునని చెబుతున్నారు.
భారత వృద్ధి రేటు 4.5 శాతం వద్ద గత క్వార్టర్ మాదిరిగానే ఉండవచ్చునని, వృద్ధిలో వేగం అందుకునే అవకాశాలు ఉన్నాయని, తమ పరిశీలనలో 4.5 శాతంగా ఉంటుందని తేలిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ ఎడ్వయిజర్ సౌమ్యాకాంతి ఘోష్ తెలిపారు. వృద్ధి రేటును 5 శాతం నుండి 4.6 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో భారత వృద్ధి రేటు 26 త్రైమాసికాల కనిష్టానికి 4.5 శాతానికి దిగజారింది. అంతకుముందు క్వార్టర్‌లో 5 శాతంగా నమోదయింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటు తగ్గింది.
భారత వృద్ధి రేటును 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం నుండి 6.1 శాతానికి తగ్గించింది స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది 11 ఏళ్ల కనిష్టం. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6 శాతం నుండి 6.5 శాతం మధ్య ఉంటుందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది.
జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొటక్ మహీంద్రా బ్యాంకు ఎకనమిస్ట్ ఉపాసన భరద్వాజ్ అన్నారు. 3వ క్వార్టర్‌లో 4.5 శాతంగా ఉండవచ్చునని కొటక్ బ్యాంకు అంచనా వేసింది.
ఆయా బ్యాంకులు లేదా రేటింగ్ ఏజెన్సీలు క్వార్టర్ 3 వృద్ధి అంచనాలు ఇలా ఉన్నాయి.. యస్ బ్యాంకు 4.5 శాతం, కొటక్ బ్యాంకు 4.5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 4.8 శాతం, ఇండియా రేటింగ్స్ 4.7 శాతం, కేర్ రేటింగ్స్ 4.5 శాతం క్రిసిల్ 5.1 శాతం, ఎస్బీఐ 4.5 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు 4.6 శాతంగా అంచనా వేశాయి.


Click it and Unblock the Notifications