ఫారెక్స్ @ 500 బిలియన్ డాలర్లు: తొలిసారి ఇండియా రికార్డ్ మార్క్
జూన్ 5వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 8.22 బిలియన్ డాలర్లు పెరిగి తొలిసారి 500 బిలియన్ డాలర్లు (50వేల కోట్ల డాలర్లు) దాటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం మే 29తో ముగిసిన వారంలో 493.480 బిలియన్ డాలర్లుగా ఉండగా, జూన్ 5వ తేదీ నాటికి ఇది 501.703 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారం 3.44 బిలియన్ డాలర్లు పెరిగాయి. బంగారం నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద ఆర్బీఐ పొజిషన్, విదేశీ కరెన్సీ ఆస్తులు (క్యాపిటల్ మార్కెట్లలోకి మూలధన ప్రవాహం, FDI, ఎక్స్టర్నల్ కమర్షియల్ రుణాలు) రూపాల్లో ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి.

నిల్వలు ఇలా పెరిగాయి
విదేశీ నిల్వలలో అతిపెద్ద భాగమైన FCAలు 8.422 బిలియన్ డాలర్లు పెరిగి 463.630 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే దేశంలో బంగారు నిల్వలు మాత్రం 329 మిలియన్లు తగ్గి 32.352 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఎస్డీఆర్ వ్యాల్యూ 10 మిలియన్ డాలర్లు పెరిగి 1.442 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వద్ద భారత్ రిజర్వ్ నిల్వల ఆస్తులు 120 మిలియన్ డాలర్లు పెరిగి 4.278 బిలియన్ డాలర్లుగా ఉంది.

తగ్గిన బంగారం నిల్వలు
దేశంలోని బంగారం నిల్వలు పడిపోయినట్లు ఆర్బీఐ లెక్కలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీ నాటికి 32.352 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇది 329 మిలియన్ డాలర్లు తగ్గాయి. భారత విదేశీ మారకపు నిల్వలు 501.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, ఇనిషియల్ క్యాపిటల్ ఔట్ ఫ్లో తగ్గిందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ తెలిపారు.

కొంత సానుకూలం
భారతదేశంలో విదేశీ నిల్వలు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు భారీగా పడిపోనున్న ఈ పరిస్థితుల్లో పెరిగిన ఫారెక్స్ నిల్వలు దేశంలోని అంతర్గాత, బాహ్య ఆర్థిక సమస్యల నిర్వహణ కోసం ప్రభుత్వానికి, ఆర్బీఐకి పెద్ద ఊరటగా భావిస్తున్నారు. గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫారెక్స్ పెరగడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశాలు.


Click it and Unblock the Notifications