క్రెడిట్ కార్డుల జోరు.. ఈ విషయాలు తెలుసుకోండి మీరు..
మన దేశంలో క్రెడిట్ కార్డుల వ్యాపారం ఊపందుకుంటోంది. మార్కెట్ అవకాశాలు అధికంగా ఉన్న కారణంగా కొత్తగా మరిన్ని కంపెనీలు ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వ్యాపారాన్ని పెంచుకోవడానికి నిధులను సమకూర్చుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు తమ సామర్థ్యాల మేరకు సొంతంగా విస్తరిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కు చెందిన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తొలి పబ్లిక్ ఇష్యుకు వచ్చే సన్నాహాల్లో ఉంది. దేశీయ మార్కెట్లో పబ్లిక్ ఇష్యుకు వస్తున్న తొలి క్రెడిట్ కార్డుల కంపెనీ ఇదే కావడంతో అందరి దృష్టీ దీనిపైనే ఉంది. ఈ సంస్థ దేశంలో చెల్లింపుల వ్యవస్థ ఎలా ఉంది.. మార్కెట్ అవకాశాలు తదితర అంశాలను సెబీకి సమర్పించింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎన్ని క్రెడిట్ కార్డుల కంపెనీలు ఉన్నాయి.. ఎంతమంది ఈ కార్డులను వాడుతున్నారు.. వ్యాపారంలో వృద్ధికి ఉన్న అవకాశాలు వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందామా మరి...

లీడర్ హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్
* మనదేశంలో క్రెడిట్ కార్డుల వ్యాపారానికి అపార అవకాశాలు ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 74 ఆర్ధిక సంస్థలు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.
* వీటిలో హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డు ల మార్కెట్ వాటాయే అధికంగా ఉంది. వీటి మొత్తం మార్కెట్ వాటా ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 72 శాతంగా ఉండటం విశేషం. క్రెడిట్ కార్డు వినియోగంలో మార్కెట్ వాటా దాదాపు 66 శాతంగా ఉంది.
* క్రెడిట్ కార్డుల మార్కెట్ వాటా విషయంలో హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ వాటా దాదాపు 27 శాతం ఉండగా.. ఎస్బీఐ వాటా 18 శాతంగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకుకు 14 శాతం, యాక్సిస్ బ్యాంకుకు 13 శాతం వాటా ఉంది.
* 2014లో 15 శాతం ఉన్న ఎస్బీఐ మార్కెట్ వాటా 2019 ఆర్ధిక సంవత్సరం నాటికి 18 శాతానికి పెరిగింది. దేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డుల జారీ కంపెనీ ఇది.
* సెప్టెంబర్ చివరి నాటికి ఈ కంపెనీ జారీ చేసిన క్రెడిట్ కార్డులు 94 లక్షల వరకు ఉన్నాయి.
* మొదటి నాలుగు టాప్ కంపెనీలు కాక తర్వాతి ఆరు కంపెనీల మార్కెట్ వాటా 22 శాతంగా ఉంది.
ఆర్బీఎల్ జోరు..
ఆర్బీఎల్ బ్యాంకు కూడా కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తోంది. కో బ్రాండ్ కార్డులతో దూసుకుపోతోంది. క్రెడిట్ కార్డు మార్కెట్ లో ఈ సంస్థ వాటా దాదాపు 4 శాతంగా ఉంది.
సిటీ బ్యాంక్ వెనక్కి..
విదేశీ బ్యాంక్ అయినా సిండి బ్యాంక్ క్రెడిట్ కార్డుల మార్కెట్లో వాటాను కోల్పోతోంది. 2014 సంవత్సరంలో దీని మార్కెట్ వాటా 13 శాతం ఉండేది. 2019 ఆర్ధిక సంవత్సరం వచ్చే వరకు ఇది కాస్తా 5 శాతానికి తగ్గిపోయింది. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, కొత్త కంపెనీలు దూసుకుపోతుండటంతో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఎదురవుతోంది.
క్రెడిట్ కార్డుల వృద్ధికి ఇవీ కారణాలు
* భారత ఆర్ధిక వ్యవస్థను నగదు సహిత ఆర్ధిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత కార్డుల వినియోగం బాగా పెరిగింది.
* డిజిటలైజేషన్, ఈ- కామర్స్, కార్డులతో చెల్లింపులకు తగిన సదుపాయాలు కల్పించడం వంటివి దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడానికి దోహదపడినాయి.
రూ. 15 లక్షల కోట్లకు చేరుతాయట...
* క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జోరుగా పెరుగుతున్నాయి. 2015 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019 ఆర్థిక సంవత్సరం వరకు వార్షిక సగటు వృద్ధి 32 శాతంగా ఉంది. రానున్న కాలంలో కూడా వృద్ధి ఇదే కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2024 నాటికి క్రెడిట్ కార్డు చెల్లింపులు రూ.15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications