అమెరికా బియ్యం డంపింగ్ ఆరోపణలపై మండిపడిన భారత్..కళ్లు తెరిచి వాస్తవాలు చూడమని హెచ్చరిక
బియ్యం ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డంపింగ్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో ఎక్కువ భాగం ప్రీమియం-గ్రేడ్ బాస్మతి బియ్యం కాగా.. ఇవి సాధారణ రకాల బియ్యం కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో డంపింగ్ అనే ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది.డంపింగ్ అంటే ఒక దేశం తన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో సాధారణ ధర కంటే చాలా తక్కువకు విక్రయించడం. అయితే భారత బియ్యం విషయంలో ఇది వర్తించదని అధికారులు అంటున్నారు.
గత వారం డొనాల్డ్ ట్రంప్ భారతదేశం తన బియ్యాన్ని అమెరికా మార్కెట్లోకి తక్కువ ధరలకు డంప్ చేస్తోందని ఆరోపిస్తూ.. అవసరమైతే సుంకాలు (టారిఫ్‌లు) విధించవచ్చని హెచ్చరించారు. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం, ఈ వాదనను పూర్తిగా తిరస్కరించింది. ఈ అంశంపై భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ..Rice డంపింగ్‌కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏవీ మాకు కనిపించడం లేదు. అంతేకాదు, మాకున్న సమాచారం మేరకు అమెరికా ఇప్పటివరకు ఎటువంటి డంపింగ్ వ్యతిరేక దర్యాప్తును కూడా ప్రారంభించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాయిటర్స్‌కు ఆయన తెలిపారు.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పెద్దగా పురోగతి లేకుండానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఈ చర్చల్లో ప్రధాన ఘర్షణాంశంగా మారింది. వాషింగ్టన్ భారత వ్యవసాయ మార్కెట్‌ను అమెరికా ఉత్పత్తులకు మరింతగా తెరవాలని కోరుతుండగా.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా భారత్ దీనిని నిరాకరిస్తోంది. గతంలో కూడా ఈ కారణంగానే ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు క్లిష్టతరంగా మారినట్లు నివేదికలు వచ్చాయి.
ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచింది. కొన్ని ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం వరకు రెట్టింపు అయ్యాయి. దీనివల్ల వస్త్రాలు, రసాయనాలు, రొయ్యల వంటి ఆహార ఉత్పత్తులు సహా అనేక కీలక భారతీయ ఎగుమతి రంగాలు ప్రభావితమయ్యాయి. దీనికి తోడు భారతదేశం డిస్కౌంట్ ధరలతో రష్యన్ చమురును కొనుగోలు చేస్తోందన్న అమెరికా ఆందోళనల నేపథ్యంలో అదనంగా 25 శాతం సుంకం కూడా విధించబడింది.
బియ్యం విషయంలో ట్రంప్ సుంకాలు విధిస్తామని హెచ్చరించినప్పటికీ.. ఎంత శాతం సుంకం విధిస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే భారత ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాలకు అదనంగా కొత్త సుంకం వస్తుందా? అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు.
అయితే గణాంకాలు చూస్తే.. భారతదేశం అమెరికాకు ఎగుమతి చేసే బియ్యం పరిమాణం మాత్రం పరిమితంగానే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారైన భారత్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20.2 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అమెరికాకు వెళ్లింది కేవలం 3.35 లక్షల టన్నుల బియ్యం మాత్రమే. ఇందులో 2.74 లక్షల టన్నులు బాస్మతి బియ్యం కావడం గమనార్హం. ఇది భారత ఎగుమతులు తక్కువ ధరల బియ్యం కంటే ప్రీమియం రకాలపైనే ఆధారపడి ఉన్నాయని స్పష్టంగా చూపిస్తోంది.
భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో అమెరికా డిప్యూటీ ట్రేడ్ ప్రతినిధి రిక్ స్విట్జర్‌ను కలిసింది. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం సహా ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగినట్లు రాయిటర్స్ నివేదించింది. ఏదేమైనా బియ్యం డంపింగ్ ఆరోపణలు కేవలం రాజకీయ, వాణిజ్య ఒత్తిడి భాగంగానే ఉన్నాయని భారత వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications