ఊరట: మరో ఉద్దీపన ప్యాకేజీకి సిద్ధమవుతోన్న కేంద్ర ప్రభుత్వం, ఈ రంగాలకు ప్యాకేజీ
కరోనా సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను తీసుకోవడంతో పాటు, వ్యక్తుల, దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తోంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. ప్రస్తుత సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించనప్పటికీ, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్ డౌన్ విధించడం లేదా కఠిన ఆంక్షలు అమలు చేయడం జరుగుతోంది. గత ఏడాది సంక్షోభం నుండి కోలుకోకముందే మరోసారి లాక్ డౌన్ దెబ్బపడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పలు ఉద్దీపన చర్యలు ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లుగా తెలుస్తోంది.

ఈ రంగాలకు ప్యాకేజీ
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వివిధ రంగాలకు మోడీ ప్రభుత్వం ఉద్దీపన ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై వర్క్ చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పర్యాటకం, విమానయానం, హాస్పిటాలిటీ, అలాగే స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీకు ఈ ఉద్దీపన ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించి ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ రంగాలకు ఊతం..
సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావితమైన రంగాలను ఆదుకోవడం కోసం కేంద్రం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశముందని బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు పర్యాటకం, విమానయానం, ఆతిథ్య రంగాలకు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సేకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. ఇటీవల పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(PHDCCI) కూడా ప్యాకేజీ విషయమై కేంద్రానికి అభ్యర్థనలు చేసింది. వృద్ధికి ఊతమిచ్చేలా 17 సిఫార్సులు చేసింది.

అందుకే ప్యాకేజీ
సెకండ్ వేవ్ కరోనా తొలి దశకంటే వేగంగా వ్యాపిస్తోందని, దేశంలోని ప్రతి ఇంటిపై ప్రభావం చూపుతోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాణిజ్య వ్యాపారాలను ఆదుకునేందుకు ప్రాధాన్యమైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా ఉద్దృతితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశముందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications