స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనాకు భారత్ తాజాగా చెక్ పెట్టింది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అమెరికాకు చైనాకన్నా అధికంగా స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసి డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. టారిఫ్‌ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని అవకాశంగా మలుచుకున్న భారత్.. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,774 కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లు అమెరికాకు ఎగుమతి చేసింది.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో అమెరికా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మన దేశం వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (240 శాతం వృద్ధి) ఎగబాకింది.చైనా వాటా 61 శాతం నుంచి 25 శాతానికి పడిపోయింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. యాపిల్ పెద్ద ఎత్తున ఎగుమతులు పెంచడంతో పాటుగా అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలే ఇందుకు ప్రధాన కారణమని కెనాలిస్ సంస్థ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యం చౌరాసియా చెప్పారు.

మన దేశం నుంచి ఎగుమతి అయిన ఫోన్ల కంపెనీ వివరాలను చూసినట్లయితే.. యాపిల్ కంపెనీ వాటా 70 శాతం ఉండగా.. తరువాతి స్థానంలో సామ్‌సంగ్, మోటారోలా కంపెనీలున్నాయి. శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి.ఇక మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13 శాతం పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23 శాతం క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది.
చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా తెలిపారు. యాపిల్ కంపెనీ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16 ప్రోను చైనాలో అసెంబుల్ చేయిస్తోంది. ఇక మిగతా మోడల్స్‌ను మాత్రం ఎక్కువగా భారత్‌లోనే అసెంబుల్ చేయిస్తోంది. త్వరలోకంపెనీ నుంచి రానున్న ఐఫోన్ 17 మోడల్‌ని ఎక్కువగా భారత్‌లో అసెంబుల్ చేయించేందుకు యాపిల్ కంపెనీ రెడీ అవుతోంది.
ప్రస్తుతం చైనాలో యాపిల్‌కు 56 అమ్మకాల సెంటర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా యాపిల్‌కు ఉన్న 530కి పైగా అమ్మకాల కేంద్రాల్లో 10 శాతానికి పైగా చైనాలోనే ఉన్నాయి. ఆగస్టు 16న షెన్‌జెన్‌లో మరో కొత్త విక్రయ కేంద్రాన్ని యాపిల్ ప్రారంభిస్తోంది. ఇక డాలియన్ సిటీలోని పార్క్‌ల్యాండ్ మాల్ స్టోర్‌ను ఆగస్టు 9 నుంచి మూసివేస్తున్నట్లు యాపిల్ తెలిపింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో విక్రయ కేంద్రాలు నిర్వహిస్తున్న పలు రిటెయిల్ సంస్థలు అక్కడ నుంచి వెళ్లిపోతుండటంతో తామూ ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని యాపిల్ కంపెనీ తెలిపింది
కాగా గతంలో యాపిల్‌తో సహా ప్రధాన స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు చైనా నుంచే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేసుకునేవి.అయితే కొవిడ్ అనంతరం యాపిల్‌తో సహా ప్రధాన కంపెనీలు అన్నీ రూటు మార్చుకున్నాయి. డ్రాగన్ కంట్రీపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications