కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు మంచి అవకాశం వచ్చిందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్ వెల్స్ అన్నారు. ఈ వైరస్ ద్వారా వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలని, ఇది సువర్ణావకాశమన్నారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత్ ముందడుగు వేస్తే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమతో వాణిజ్య ఒప్పందాలకు ముందు భారత్ సంస్కరణలు చేపట్టవలసి ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందాలు మరింత బలపడాలని తమ దేశం చూస్తోందన్నారు.

భారత్ సద్వినియోగం చేసుకోవాలి.. మేం కఠినంగానే ఉంటాం
కరోనా ప్రభావం తొలగిపోయిన అనంతరం తమ దేశానికి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు తమ సేవలను భారీ ఎత్తున విస్తరించాలని చూస్తున్నాయని, దీనిని భారత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎలైస్ వెల్స్. భారత్ రక్షణాత్మక ధోరణితో ముందుకు సాగుతోందని, అలా కాకుండా స్నేహపూర్వక విధానాలతో ముందుకు రావాలన్నారు. అయితే తమ దేశానికి వచ్చేసరికి మరోలా స్పందించారు. తమది వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశమని, నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికి అలాగే ఉంటాయన్నారు.

చైనా నుండి వస్తున్నాయి.. భారత్‌కు మా చేయూత
భారత్ మాత్రం ఆ స్థాయిలో ఒప్పందాలు చేసుకునేలా కనిపించడం లేదని ఎలైస్ చెప్పారు. అందుకే అమెరికాతోనే కాకుండా యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతోను భారత్ వాణిజ్య సంబంధాలు దెబ్బ తిన్నాయని చెప్పారు. చైనా నుండి ఇతర దేశాలు తప్పుకోవాలని చూస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఇది సువర్ణావకాశమన్నారు. సరైన వాణిజ్య విధానాలు, మౌలిక సదుపాయాలతో వస్తే బాగుంటుందని సూచించారు. తాము (అమెరికా) కూడా భారత్‌కు చేయూతనివ్వాలని చూస్తున్నామన్నారు.

వాణిజ్య ఒప్పందం కోరుకుంటున్నాం..
అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోందని, కానీ భారత్ అలా ఉండటం లేదన్నారు. అందుకే భారత్ రక్షణాత్మక విధానాలతో కాకుండా మార్కెట్ స్నేహపూర్వక విధానాలతో ముందుకు రావాలన్నారు. అమెరికా - ఇండియాలు గత రెండేళ్లుగా వాణిజ్య ఒప్పందంపై ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో ఒప్పందాలపై సంతకాలు ఉంటాయని ట్రంప్ కూడా చెప్పారని గుర్తు చేసారు. ఈ ఫిబ్రవరిలో ట్రంప్ భారత్‌లో పర్యటించినా అది కుదరలేదన్నారు. కానీ ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలు ఉన్నాయన్నారు.

వాణిజ్య ఒప్పందాల్లో సమస్యలు సహజం
ఏ వాణిజ్య ఒప్పందంలో అయినా సమస్యలు సహజమేనని ఎలైస్ చెప్పారు. రెండేళ్లుగా వాటిపై దృష్టి పెట్టామన్నారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ అడ్డంకులు తగ్గించడం అధ్యక్షుడి బాధ్యత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడుల కోసం భారత్ తన మార్కెట్‌ను ఎంత వరకు తెరవగలుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. భారత్ సుంకాలు తగ్గించడం ద్వారా ఉత్పాదక సంస్థలను ఆహ్వానించాలన్నారు. ఇది భారత్‌కు మంచి అవకాశమన్నారు.

ట్రంప్ గుర్తించారు.. కరోనా టీకాలో భారత్ కీలక భాగస్వామి
ఔషధ రంగం విషయానికి వస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ముఖ్యం అని చెప్పారు. భారత్ నుండి రెమ్డెసివిర్ వెళ్తున్నాయని ప్రకటన వచ్చాక అమెరికా స్వాగతించిందని చెప్పారు. ఔషధ రంగంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ట్రంప్ దీనిని గుర్తించారని చెప్పారు. కరోనా టీకా అభివృద్ధికి భారత్ కీలక భాగస్వామి అన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అమెరికాతో కలిసి పని చేస్తోందన్నారు.


Click it and Unblock the Notifications