దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను తోసిరాజని భారత్ త్వరలోనే మరో కొత్త ఫీట్ ను సాధించబోతోంది. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియా వచ్చే ఆరేళ్లలో తన ప్రస్తుత ర్యాంకు ను మరింతగా మెరుగు పరచుకొని దూసుకుపోనుంది. 2026 నాటికి మన దేశం ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుంది. ఇందుకోసం యూరోప్ లోని అతి పటిష్టమైన, మెరుగైన ఆర్థికవ్యవస్థగా ఉన్నటువంటి జర్మనీ ని వెనక్కు నెట్టబోతోంది. దీనిపై బ్రిటన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సిఈబిఆర్) అనే ప్రఖ్యాత పరిశోధన సంస్థ ఒక నివేదిక రూపొందించింది.
దాని ప్రకారం భారత్ ప్రపంచం దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందువరుసలో ఉండబోతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కళలు కంటున్నఅనేక ఆర్థిక అంశాలకు ఈ నివేదిక కొంత మద్దతునిచ్చినట్లైంది. ఇదే వేగంతో అభివృద్ధి సాధిస్తే 2034 నాటికి భారత దేశం జపాన్ ఆర్థిక వ్యవస్థను కూడా దాటుకొని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా నిలిచే ఆస్కారం ఉందని సిఈబిఆర్ వెల్లడించింది. దీనిపై ప్రముఖ వార్త ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.

మూడు దేశాల పోటీ...
పటిష్టమైన ఆర్థిక పునాదుల పై నడిచిన ఇండియన్ ఎకానమీ 2019 లో సరికొత్త రికార్డులను సాధించింది. మొట్టమొదటి సారి యూరోప్ లోని బలమైన ఆర్థిక వ్యవస్థలను వెనక్కి నెట్టి మరీ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎకానమీ గా ఆవిర్భవించింది. ఇందుకోసం ఏకంగా యూకే, ఫ్రాన్స్ దేశాలను అధిగమించి నెంబర్ 5 స్థానాన్ని భారత్ సాధించింది. ఇప్పుడు అదే వేగంతో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపుగా పరుగులు పెడుతోంది. త్వరలోనే దానిని కూడా తన ఖాతాలో వేసుకోబోతోంది. వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ 2020 అనే పేరుతో సిఈబిఆర్ ఈ నివేదిక ను ఆవిష్కరించింది. అయితే, అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ నెంబర్ 3 ఎకానమీ స్లాట్ కోసం మాత్రం వచ్చే 15 ఏళ్ళ పాటు జర్మనీ, జపాన్, ఇండియా ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని పరిశోధక సంస్థ అభిప్రాయపడింది. ఇకపై మరో దశాబ్దం పాటు ఏ దేశమైతే వేగంగా అభివృద్ధిని సాధిస్తుందో అదే దేశం అత్యంత వేగంగా ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

2026 లో 5 ట్రిలియన్ ఎకానమీ...
ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు భారత దేశ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ 350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించి అవకాశం ఇండియాకు ఉందని సిఈబిఆర్ వెల్లడించింది. అయితే ప్రధాని ఊహించినట్లు అది 2024 లో సాధ్యం కాదని, అందుకోసం 2026 వరకు వేచి చూడాలని ఈ సంస్థ అభిప్రాయపడింది. 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంశంపై నరేంద్ర మోడీ తో పాటు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాత్రమే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఆర్థిక వేత్తలు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు ని పరిగణనలోకి తీసుకుంటే అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా 5 ట్రిలియన్ జీడీపీ ప్రశ్నే ఉత్పన్నం కాబోదని ఆయన వ్యాఖ్యానించారు.

రాడికల్ రిఫార్మ్స్...
తన రిపోర్ట్ ద్వారా చాలా పాజిటివ్ రెమర్క్స్ చేసిన సీఈబీఆర్ ... భారత్ కు ఒక సూచన కూడా చేసింది. నెమ్మదిస్తున్న ఆర్థికవ్యవస్థ ను గాడిలో పెట్టాల్సి ఉంటుందని, అందుకోసం రాడికల్ ఎకనామిక్ రిఫార్మ్స్ (విస్తృత ఆర్థిక సరళీకరణలు) అమలు చేయాల్సి ఉంటుందని సూచించింది. ఈ ఏడాదిలో భారత్ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ళ కనిష్ట స్థాయి ఐన 4.5% నికి పడిపోవటం ఇక్కడ గమనార్హం. అంతకంకూ తగ్గుతున్న వృద్ధి రేటుని మళ్ళీ పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. లేదంటే అనుకున్న సమయానికి అనుకున్న స్థానానికి చేరుకోవటం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా భారత్, ఇండోనేషియా వంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతూ తమ ర్యాంకులు మెరుగు పరచుకుంటున్నా.... అది అమెరికా, చైనా వంటి ఎకనామిక్ సూపర్ పవర్ లపై పెద్ద ప్రభావం చూపబోవని నివేదిక స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఉండగా చైనా రెండో స్థానంలో జపాన్ మూడో స్థానంలో కొనాగుతున్నాయి. జర్మనీ నాలుగు, ఇండియా ఐదో స్థానంలో ఉన్నాయి.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications