ప్రపంచ బియ్యం ఉత్పత్తి రంగంలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉన్న చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో బియ్యం రంగంలో చైనా దీర్ఘకాల ఆధిపత్యానికి తెరపడగా.. భారత్ ప్రపంచానికి కొత్తగా బియ్యం రాజుగా అవతరించింది.
చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అరుదైన లోహాల నుంచి అనేక కీలక వస్తువుల వరకు ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాంటి దేశాన్ని బియ్యం ఉత్పత్తిలో వెనక్కి నెట్టడం భారత్‌కు వ్యూహాత్మకంగా.. ఆర్థికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విజయంగా చెప్పవచ్చు. అమెరికా కూడా ఈ విజయాన్ని అధికారికంగా అంగీకరించింది. అమెరికా వ్యవసాయ శాఖ (USDA) డిసెంబర్ 2025 నివేదిక ప్రకారం, 2024-25 సంవత్సరానికి భారతదేశ బియ్యం ఉత్పత్తి 152 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 146 మిలియన్ మెట్రిక్ టన్నుల వద్ద నిలిచింది. ఈ గణాంకాలతో ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో భారత్ వాటా 28 శాతానికి పైగా పెరిగింది.

ఈ పరిణామం చైనాకు పెద్ద ఆందోళనగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా బియ్యం ఉత్పత్తిలో తామే అగ్రస్థానంలో ఉన్నామని భావించిన డ్రాగన్‌కు.. భారత్ సాధించిన ఈ ఘనత వ్యూహాత్మక షాక్‌గా మారింది. నివేదికల ప్రకారం భారతదేశ విజయానికి తైవాన్ నుంచి వచ్చిన సాంకేతిక సహకారం కూడా ఒక కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్త సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ అంశం చైనాకు మరింత అసహనాన్ని కలిగిస్తోంది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బియ్యం మూలం గురించి మాట్లాడినప్పుడు భారతదేశం పేరు ప్రముఖంగా వినిపించేది. కానీ ఉత్పత్తి పరంగా చైనా ముందుండేది. కానీ ఇప్పుడు ఆ సమీకరణ పూర్తిగా మారింది. అంతర్జాతీయ బియ్యం సంస్థ (International Rice Research Institute - IRRI) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు సింగ్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అవతరించడం చరిత్రాత్మక విజయమే కాకుండా, ప్రపంచ ఆహార భద్రతలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం భారతీయ బియ్యం 172 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇది కేవలం వాణిజ్య అంశం మాత్రమే కాకుండా, భారత విదేశాంగ విధానంలో కూడా ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆహార భద్రత కల్పించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. బియ్యం ఆదాయం పరంగా కూడా భారత్ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,23,000 రకాల బియ్యం ఉండగా, వాటిలో దాదాపు 60 వేల రకాలు భారతదేశంలోనే లభిస్తాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో రూ. 4.5 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో బియ్యం వాటా సుమారు 24 శాతం. బాస్మతి, బాస్మతియేతర బియ్యం ఎగుమతుల ద్వారా మాత్రమే భారత్ రూ. 1.05 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications