అంతా ప్రధాని కార్యాలయం నుంచే, మంత్రులు డమ్మీలు: రఘురాం రాజన్ తీవ్ర విమర్శలు
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్యపై కనిపిస్తోందని, ప్రస్తుతం వృద్ధి మాంద్యంలో ఉన్నామని, ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం అయి ఉందని, కేంద్రమంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారని ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

ప్రధాని కార్యాలయం చుట్టూనే తిరుగుతున్నాయి
వృద్ధికి, మాంద్యానికి మధ్యలో దేశ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దారుణంగా పడిపోయిందని రఘురాం రాజన్ అన్నారు. ప్రధాని కార్యాలయంలోనే అధికారం కేంద్రీకృతమై ఉందన్నారు. మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ప్రస్తుత ప్రభుత్వ కేంద్రీకృత విధానం నుంచి ప్రారంభించాలన్నారు. ఎందుకంటే ఏ చిన్న నిర్ణయమైనా, ఆలోచనలు - ప్రణాళికలైనా ప్రధాని చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు లేదంటే పీఎంవో నుంచి వెలువడుతున్నాయన్నారు.

సామాజికంగా ఉపయోగపడొచ్చు
అవి రాజకీయంగా, సామాజికంగా ఉపయోగపడేవి కావొచ్చునని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని రఘురాం రాజన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతంతో 26 త్రైమాసికాల కనిష్టానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే...
2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకు వెళ్లాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఏడాది వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం మధ్య స్థిరంగా ఉండాలని రాజన్ అన్నారు. ఈ లక్ష్యం నెరవేరడం కలే అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది వాస్తవ రూపం దాల్చేలా లేదని పేర్కొన్నారు.

మాంద్యంలో ఉంది...
మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అనారోగ్యానికిలోనై అంపశయ్య పైకి చేరుకుందన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మాంద్యంలో పయనిస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు తీవ్ర దురవస్థలో ఉన్నాయని, దీంతో ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి మాంద్యంలో ఉందన్నారు.

ఇది సమస్య తీవ్రతకు సంకేతం
నిరుద్యోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా యువతలో నిరుద్యోగం పెరిగిపోవడంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. చేయిదాటితే యువతలో అశాంతి చెలరేగే ప్రమాదముందన్నారు. పెట్టుబడులు రావడం లేదని, ఇది సమస్య తీవ్రతకు సంకేతం అన్నారు.


Click it and Unblock the Notifications