మోడీ నాయకత్వంలో.. 7-8 ఏళ్లలో ప్రపంచ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్!
భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధి వేగంతో ముందుకు సాగుతోందని, కరోనా మహమ్మారి ప్రభావానికి గురికాకుంటే రాబోయే ఏడు ఎనిమిది ఏళ్లలో ప్రపంచ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నిలిచి ఉంటుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. టాప్ 2 ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనాలపై కూడా ఈ మహమ్మారి ప్రభావం భారీగానే పడింది.

భారత్ బలంగా మారుతోంది.. బలమైన ఇమేజ్
భారత్ బలంగా మారుతోందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం ప్రపంచవ్యాప్తంగా బలమైన ఇమేజ్‌ను సంపాదించుకోగలిగిందని రాజ్‌నాథ్ చెప్పారు. మంచి నాయకుడి ఆధ్వర్యంలో దేశం మంచి ఆర్థిక వృద్ధితో ముందుకు సాగుతోందన్నారు. ఈ కరోనా మహమ్మారి లేకుంటే కనుక రాబోయే ఏడెనిమిది ఏళ్లలో మన దేశం టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచి ఉండేదన్నారు. అయినప్పటికీ మనం కరోనాను విజయవంతంగా ఎదుర్కొని, ముందుకు సాగుతామనే విశ్వాసం ఉందని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుంది!
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అమెరికా, సింగపూర్, జపాన్ సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణించాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో వృద్ధి రేటు భారీగా పడిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నాయి. అయితే కోలుకోవడానికి మరో ఆరు నెలల నుండి ఏడాది పడుతుందని భావిస్తున్నారు. కరోనా వ్యాక్సీన్ వస్తే కోలుకోవడం వేగవంతమవుతుంది.

వెంకయ్య గురించి రాజ్‌నాథ్
వెంకయ్య నాయుడి గురించి మాట్లాడుతూ.. వెంకయ్య తన జీవితంలో ఏం ఆచరించారో, ఏం అనుసరించారో ఈ పుస్తకం తెలియజేస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. ఆయన ఎప్పుడూ దేశం ఫస్ట్, పార్టీ సెకండ్, మనం లాస్ట్ అని చెబుతారని గుర్తు చేశారు. ఈ పుస్తకం పాఠకులకు మంచి జ్ఞానాన్ని ఇస్తుందన్నారు. ఒక తరం మరో తరానికి ఇవ్వగలికే మంచి బహుమతి పుస్తకం అన్నారు. వెంకయ్య నాయుడు మాట్లాడే చాలా సందర్భాల్లో తాను విన్నానని, ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications