భారతదేశంలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (REPM) తయారీకి సంబంధించిన రూ.7,280 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పథకం ద్వారా భారతదేశంలో ప్రతి సంవత్సరం 6 వేల మెట్రిక్ టన్నుల (MTPA) ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఆధునిక REPM తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశాన్ని మరింత ఆత్మనిర్భర్ దిశగా తీసుకెళ్లే వ్యూహాత్మక అడుగుగా భావించబడుతోంది.
రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలలో ఒకటి. వీటి ఉపయోగం రోజురోజుకూ పెరుగుతోంది, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగం, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలలో ఇవి అవిభాజ్య భాగాలుగా మారాయి. ప్రస్తుతానికి ఈ అయస్కాంతాలను ప్రధానంగా చైనా, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు సమస్యలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డిమాండ్ పెరుగుదల వంటి కారణాల వల్ల REPMలు వ్యూహాత్మకంగా అత్యంత కీలక ఉత్పత్తిగా మారాయి. ఇలాంటి సమయంలో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది అవసరం మాత్రమే కాకుండా, అత్యవసరం కూడా అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకంలో మొత్తం రూ.7,280 కోట్ల పెట్టుబడి ఉండగా, ఇందులో రూ.6,450 కోట్లు అమ్మకాల ఆధారంగా ఐదేళ్లపాటు ప్రోత్సాహకంగా (PLI తరహాలో) కంపెనీలకు అందించనున్నారు. అదనంగా, REPM ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి రూ.750 కోట్ల మూలధన సబ్సిడీ మంజూరు చేయబడుతుంది. ఈ పథకం ద్వారా 1,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇవి ప్రపంచ పోటీ బిడ్డింగ్ ఆధారంగా ఎంపిక చేయబడతాయి. ఈ యూనిట్లు Rare Earth ఆక్సైడ్స్‌ను లోహాలుగా మార్చడం, ఆ లోహాలను మిశ్రమాల్లోకి మార్చడం, చివరకు పూర్తిస్థాయి అధిక పనితీరు మాగ్నెట్లను ఉత్పత్తి చేయడం వంటి మొత్తం ప్రక్రియను దేశంలోనే నిర్వహించే సామర్థ్యంతో రూపొందించబడతాయి. దీనివల్ల భారత్‌కు పూర్తి ఎండ్-టు-ఎండ్ స్వయంపూర్తి కలుగుతుంది.ఈ ప్రాజెక్టు అమలు వ్యవధి మొత్తం ఏడు సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
మొదటి రెండు సంవత్సరాలలో పరిశ్రమల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయబడతాయి. తరువాత ఐదేళ్లపాటు కంపెనీలు ఉత్పత్తి, అమ్మకాల ఆధారంగా ప్రోత్సాహకాలను పొందుతాయి. 2025తో పోలిస్తే 2030 నాటికి REPMలకు డిమాండ్ రెట్టింపు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలకు భారీగా డిమాండ్ పెరుగుతుండడంతో, భారతదేశంలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇప్పుడు పెంచడం అత్యవసరంగా మారింది.
ఈ పథకం అమలు ద్వారా దేశంలో ఉన్నత నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు సృష్టించబడతాయి. అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రక్షణ మరియు అంతరిక్ష రంగాల్లో స్వయం సమృద్ధి కలుగుతుంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చు. పైగా, కార్బన్ ఉద్గారాలను తగ్గించి 2070 నాటికి నికర సున్నా లక్ష్యాన్ని సాధించాలన్న భారత సంకల్పానికి ఈ పథకం మరింత బలాన్ని ఇస్తుంది.
ఈ విధంగా రూ.7,280 కోట్ల REPM పథకం భారత పారిశ్రామిక రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి, రాబోయే దశాబ్దంలో ప్రపంచ మాగ్నెట్ తయారీ మార్కెట్లో భారత్‌ను ప్రముఖ స్థానంలో నిలబెట్టే దిశగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇది కేవలం ఆర్థిక పెట్టుబడి కాదు, భవిష్యత్తు టెక్నాలజీ యుగం వైపు భారతదేశం వేసిన విశ్వాసపూర్వక అడుగుగా నిపుణులుఅభివర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications