income tax: తాజా బడ్జెట్ ప్రకటన అనుసరించి.. 7 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. అయితే వివిధ సెక్షన్ల ద్వారా కొంత మేరకు టాక్స మినహాయింపు పొందే అవకాశం ఉంది. పాత, కొత్త విధానాలను ఉపయోగించుకుని సాధ్యమైనంత వరకు చెల్లించాల్సిన పన్ను తగ్గించుకోవడానికి ఉద్యోగులు ప్రయత్నిస్తారు. వీరి కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
'AIS ఫర్ టాక్స్ పేయర్' పేరిట IT విభాగం ఓ మొబైల్ యాప్ ను రిలీజ్ చేసింది. దీని ద్వారా TDS/TCS, వడ్డీ, డివిడెండ్‌లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రీఫండ్ మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట మానిటర్ చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. వీటితో పాటు అందుబాటులో ఉన్న GST డేటా, విదేశీ చెల్లింపులనూ దీని ద్వారా చూడవచ్చు.

అందుబాటులో ఉన్న వార్షిక సమాచార నివేదిక (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS) చూడటాన్ని.. ఈ యాప్ సులభతరం చేస్తుందని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ యాప్ ప్రదర్శిస్తుందని వెల్లడిచింది. ఆయా సమాచారంపై తమ అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేయవచ్చని చెప్పింది. టాక్స్ పేయర్స్ కు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది.
గూగుల్ ప్లే మరియు యాప్ స్టోర్ల నుంచి 'AIS ఫర్ టాక్స్ పేయర్' యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాన్ నంబర్ ద్వారా రిజిస్టర్ అయ్యి, దీనిని యాక్సెస్ చేయవచ్చు. అయితే మొబైల్ నంబర్ కు పంపిన OTP మరియు ఇ-ఫైలింగ్ పోర్టల్ లో నమోదు కాబడిన ఇ-మెయిల్ తో ప్రామాణీకరించడం తప్పనిసరి. ఇది పూర్తయిన పిమ్మట 4-అంకెల పిన్ సెట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications