ITR Filing: మరింత వేగంగా ట్యాక్స్ రిఫండ్.. FY23లో సగటున ఎన్ని రోజులు పట్టిందంటే..
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడం కొత్త వారికి కొంత క్లిష్టంగా అనిపించవచ్చు. అయితే ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్ ఫారమ్‌ల ద్వారా ఈ విధానం సరళీకృతం చేయబడింది. FY23కి గాను పన్ను చెల్లింపుదారులకు 30 రోజులలోపు 80 శాతం రీఫండ్‌లు అందించబడినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది. తద్వారా ఈ ఫారమ్‌లు మరింత సౌకర్యవంతంగా మారినట్లు తెలుస్తోంది.
FY23లో ఆదాయపు పన్ను రీఫండ్ కోసం తీసుకున్న సగటు సమయాన్ని 16 రోజులకు తగ్గించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించింది. FY22లో 26 రోజులతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినట్లు పేర్కొంది. రిటర్నుల ఫైలింగ్ మొదలైన మరుసటి రోజే దాఖలు చేసిన రిటర్నుల శాతం కూడా 21 నుంచి 42 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

టెక్నాలజీ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఏకీకరణతో ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. జూలై 28 2022న ఒకే రోజులో 22.94 లక్షల రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. సరిదిద్దాల్సిన అభ్యర్థనలు సైతం కేవలం 0.1 శాతానికి తగ్గాయి. అవి కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రాసెస్ చేయబడుతున్నాయి.
FY23 చివరి నాటికి 4 లక్షల మందికి ఫేస్ లెస్ అసెస్మెంట్ ను కూడా ప్రత్యక్ష పన్నుల శాఖ పూర్తి చేసింది. FY22 మరియు FY23 మధ్య ఈ ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులు 60 శాతం తగ్గాయి. పెరుగుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు చొప్పిస్తూ, పన్ను చెల్లింపుదారులకు సరళమైన రీతిలో సేవలు అందించడానికి ఆదాయపు పన్ను శాఖ చేసిన ప్రయత్నాల ఫలితమే ఇది అని ఒప్పుకోక తప్పదు.


Click it and Unblock the Notifications