శ్రీసిమెంట్ కు సంబంధించిన వ్యాపారాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్ చేయడం తెలిసిందే. పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్లు ఈ సోదాల ద్వారా తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కనీసం 23 వేల కోట్ల మేర పన్ను మోసం జరిగినట్లు తెలిపే పత్రాలు లభించినట్లు వెల్లడించాయి.
ఈ పత్రాల ప్రకారం చూస్తే, ఏటా దాదాపు 1,200 నుంచి 1,400 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు తేలిందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. గ్రూపు కంపెనీల పన్ను మినహాయింపు క్లెయిమ్‌లపై IT శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఈ దాడులు జరిపినట్లు చెప్పారు. స్థానిక సంస్థలతో కుదుర్చుకున్న నకిలీ ఒప్పందాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయాయని స్పష్టం చేశారు.

జైపూర్ IT విభాగానికి చెందిన ఓ బృందం.. జైపూర్, బీవార్, ఉదయ్‌పూర్, అజ్మీర్ మరియు చిత్తోర్‌గఢ్‌లోని శ్రీ సిమెంట్‌కు చెందిన 24 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో 200 మందికి పైగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఫోర్జరీకి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి కానీ IT శాఖ అధికారులు వాటిని ఖండించారు.
సిమెంట్ ఉత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు, అందుకు చెల్లించిన పేమెంట్స్‌లో భారీగా అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. కొత్త సాంకేతికత, సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ శాఖ ఈ మోసాన్ని గుర్తించిందని తెలిపారు. మరికొన్ని కంపెనీలు కూడా తమ రాడార్‌లో ఉన్నాయని, త్వరలో రియల్ ఎస్టేట్ మరియు మైనింగ్ కంపెనీలు సహా పలువురు బడా వ్యాపారవేత్తలపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications