కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పన్ను చెల్లింపుదారులందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. "రెండు రకాల పన్ను విధానాల్లో (Tax Regime) ఎంత వరకు పన్ను ఉండదు?". ఈ ఏడాది నుంచి 'ఆదాయపు పన్ను చట్టం 2025' , 'ఆదాయపు పన్ను రూల్స్ 2026' అమలులోకి రానున్నాయి. ఇవి పాత 1961 చట్టం స్థానంలో వస్తున్నప్పటికీ, పన్ను శ్లాబులు లేదా రేట్లలో ప్రభుత్వం పెద్దగా మార్పులేమీ చేయలేదు. అయితే, పరిమితుల విషయంలో కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలి.

పాత పన్ను విధానం (Old Tax Regime) లో పరిమితులు
పాత పద్ధతిలో వివిధ మినహాయింపులు (Deductions) కోరుకునే వారికి ఈ క్రింది విధంగా పన్ను వర్తిస్తుంది..
- ప్రాథమిక మినహాయింపు: సాధారణ వ్యక్తులకు రూ. 2.5 లక్షలు, సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షలు , సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల వరకు ప్రాథమికంగా పన్ను ఉండదు.
- సెక్షన్ 87A రిబేట్: మొత్తం ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే, రూ. 12,500 వరకు రిబేట్ లభిస్తుంది. ఫలితంగా రూ. 5 లక్షల వరకు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు.
- అదనపు మినహాయింపులు: మీ ఆదాయం రూ. 5 లక్షలు దాటినా కూడా.. స్టాండర్డ్ డిడక్షన్ (రూ. 50,000), సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షలు, హోమ్ లోన్ వడ్డీపై రూ. 2 లక్షలు , హెల్త్ ఇన్సూరెన్స్ (80D) వంటివి క్లెయిమ్ చేసి, మీ నికర ఆదాయాన్ని రూ. 5 లక్షల లోపుకు తీసుకువస్తే పన్ను సున్నా అవుతుంది.
కొత్త పన్ను విధానం (New Tax Regime) లో పరిమితులు
ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని (Tax Regime) మరింత సరళీకృతం చేసింది. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ మినహాయింపులు చూపాల్సిన అవసరం లేదు.
- ప్రాథమిక మినహాయింపు: అందరికీ (సీనియర్ సిటిజన్లతో సహా) ప్రాథమికంగా రూ. 4 లక్షల వరకు పన్ను ఉండదు.
- పూర్తి పన్ను మినహాయింపు: సెక్షన్ 87A కింద లభించే రూ. 60,000 రిబేట్ కారణంగా రూ. 12 లక్షల వరకు ఆదాయంపై అసలు పన్ను పడదు.
- జీతం పొందే వారికి అదనపు వెసులుబాటు: ఉద్యోగులకు లభించే రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే, మొత్తం రూ. 12.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను సున్నా అవుతుంది.
పన్ను ఎప్పుడు కట్టాల్సి వస్తుంది?
కొన్ని సందర్భాల్లో మీ ఆదాయం రూ. 12 లక్షల లోపే ఉన్నా పన్ను పడే అవకాశం ఉంది..
- మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం (Taxable Income) రూ. 12 లక్షల పైన ఉంటే.
- మీ ఆదాయంలో మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ల ద్వారా వచ్చిన 'క్యాపిటల్ గెయిన్స్' (Capital Gains) ఉన్నప్పుడు. బడ్జెట్ 2026 క్లారిటీ ప్రకారం, వీటికి ప్రత్యేక పన్ను రేట్లు వర్తిస్తాయి కాబట్టి, ఇవి సెక్షన్ 87A రిబేట్‌కు అర్హత పొందవు.
మొత్తానికి, ఏ పన్ను విధానం (Tax regime) ఎంచుకోవాలనేది మీ పొదుపు , పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకపోతే కొత్త విధానం ఉత్తమం, అదే భారీగా హోమ్ లోన్ లేదా ఇతర పొదుపులు ఉంటే పాత విధానం లాభదాయకం కావచ్చు. ఏప్రిల్ 1 లోపే మీ ప్లానింగ్ పూర్తి చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications