Income Tax: ఉద్యోగులు, ట్రస్టులు, HNIలకు టాక్స్ నోటీసులు.. మ్యాటర్ ఫుల్ సీరియస్..
Income Tax Notice: 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసిన దాదాపు 22,000 మందికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. గడచిన 15 రోజుల వ్యవధిలో ఈ ఇన్టిమేషన్ నోటీసులన్నీ పంపబడ్డాయి.
టాక్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం జీతం పొందే ఉద్యోగులు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్టులకు నోటీసులను పంపినట్లు వెల్లడించారు. వీరు ఐటీఆర్ ప్రకారం క్లెయిమ్ చేసిన రిఫండ్స్.. వారి ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటన(AIS)లోని సమాచారంతో సరిపోలలేదని నోటీసుల్లో పన్ను శాఖ స్పష్టం చేసింది. రిటర్న్‌లు, డిపార్ట్‌మెంటల్ గణాంకాల్లో క్లెయిమ్ చేసిన పన్ను మినహాయింపుల మధ్య రూ.50,000 కంటే ఎక్కువ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు.

నోటీసులు అందుకున్న వారిలో దాదాపు 12,000 మంది జీతాలు పొందే ఉద్యోగులు ఉన్నారు. అలాగే HUF విభాగంలో రిటర్న్‌లు దాఖలు చేసిన సుమారు 8,000 మంది పన్ను చెల్లింపుదారులకు కూడా డిపార్ట్‌మెంట్ నోటీసు పంపింది. దాఖలు చేసిన రిటర్న్‌కు, డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డేటా మధ్య ఆదాయ వ్యత్యాసం రూ.50 లక్షలకు పైగా ఉన్నట్లు బయటపడటంతో తాజా చర్యలకు అధికారులు ఉపక్రమించారు.

ఇదే క్రమంలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ వ్యత్యాసంతో రిటర్న్స్ ఫైల్ చేసిన 900 మంది HNIలు, రూ.10 కోట్ల కంటే ఎక్కువ వ్యత్యాసం కలిగి ఉన్న 1,200 ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలకు కూడా IT శాఖ నోటీసులు పంపింది. సాధారణంగా డిపార్ట్‌మెంట్ ప్రైమరీ డేటా అనలిటిక్స్ దాదాపు 2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్న్‌లలో అక్రమాలు, ఇర్రెగ్యులారిటీలను గుర్తించింది. సదరు వ్యక్తుల బ్యాంక్, యూపీఐ చెల్లింపుల డేటాకు వారు ఇచ్చిన డిక్లరేషన్లు, ఖర్చులకు సరిపోలలేదని ఐటీ శాఖ తెలిపింది. ప్రస్తుతం పంపిన నోటీసులకు టాక్స్ చెల్లింపుదారులు స్పందించకపోతే అప్పుడు అధికారులు డిమాండ్ నోటీసులు పంపుతారు.


Click it and Unblock the Notifications