కరోనా బాధిత కుటుంబాలకు భారీ ఊరట, ఆ డబ్బుపై పన్ను మినహాయింపు
కరోనా సమయంలో ఇబ్బందులుపడుతున్న కొంతమంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. ఆదాయ పన్ను శాఖ పలు ఓదార్పు చర్యలను ప్రకటించింది. ఉద్యోగులకు కరోనా ఖర్చుల కోసం కంపెనీలు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆదాయ పన్ను నుండి మినహాయించింది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కంపెనీలు చెల్లించే పరిహారంపై పూర్తిగా పన్ను మినహాయింపు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఉత్తర్వులు జారీ చేసింది.

పరిహారంపై పన్ను లేదు
ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంస్థలు ఇచ్చే పరిహారం మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదని సీబీడీటీ వెల్లడించింది. ఇతరుల నుండి అందే సాయంపై రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో చికిత్స కోసం పలువురికి వారి శ్రేయోభిలాషులు, బంధువులు ఆర్థిక సహాయం చేశారని, వారికి లభించిన మొత్తానికి లెక్కలు చూపడం వంటి అవసరం లేకుండా ఈ చర్య తోడ్పడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.

వివాద్ సే విశ్వాస్ పొడిగింపు
పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. పన్ను చెల్లించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. స్థిరాస్తిని విక్రయించినప్పుడు ఆ మొత్తాన్ని రెండు లేదా మూడేళ్లలో నిబంధనల ప్రకారం తిరిగి పెట్టుబడి పెట్టాలి. ఈ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 29 వరకూ ఉంటే.. సెప్టెంబరు 30 వరకు ఆ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతినిచ్చింది.

ఈ గడువు పొడిగింపు
పాన్-ఆధార్ అనుసంధానం చివరి తేదీ కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. తద్వారా సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. ఉద్యోగులకు ఫామ్ 16లో టీడీఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సంస్థలకు ఉన్న గడువు జూలై 31 వరకు పెంచింది. 2020-21 జనవరి-మార్చి టీడీఎస్ స్టేట్‌మెంట్ దాఖలు గడువు జూలై 15వ తేదీ వరకు పొడిగించారు.


Click it and Unblock the Notifications