IMF: ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. దీనికి కరోనా నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు అనేక కీలక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఎలా ఉండనుందనే దానిపై ఐఎమ్ఎఫ్ చీఫ్ సంచలన ప్రకటన చేశారు.
2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతం కంటే తక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. మరికొంత కాలం పాటు ఆర్థిక కార్యకలాపాలు మందంగానే కొనసాగుతాయని ఆమె తెలిపారు. రానున్న ఐదేళ్లలో 3% కంటే తక్కువ వృద్ధి నమోదు కానుందని వెల్లడించారు. 1990 నుంచి ఇది అత్యల్పంగా ఉంది. గడచిన రెండు దశాబ్దాల సగటు 3.8 శాతం కంటే తాజా అంచనాలు తక్కువగా ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్, చైనాల వాటా సగం ఉంటుందని IMF తాజా నివేదికలో వెల్లడించింది. అల్పాదాయ దేశాలకు వృద్ధి మందగమనం చాలా పెద్ద దెబ్బ అని ఆమె అన్నారు. దీని కారణంగా ఆయా దేశాల్లో పేదరికం, ఆకలి కేకలు మరింతగా పెరగవచ్చని తెలిపారు. ఇలాంటి సందర్భంలో వచ్చే వారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను విధాన రూపకర్తలు చర్చించనున్నారు. భారీగా వడ్డీ రేట్ల పెంపులు జరుగుతున్న క్రమంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 90 శాతం తమ వృద్ధి రేటులో తగ్గుదలను అంచనా వేస్తున్నాయని IMF చీఫ్ పేర్కొన్నారు. చిన్న దేశాలకు ఎగుమతుల డిమాండ్ తగ్గుదల కారణంగా రుణ ఖర్చులు అధికమైతాయని ఐఎమ్ఎఫ్ తెలిపింది. అయితే 2008 సంక్షోభం తర్వాత గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో తాజా సంక్షోభం చాలా దేశాల్లో ప్రకంపనలు సృష్టిచటంపై చర్చ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications