భారత వృద్ధి రేటు అంచనాలు భారీగా తగ్గించిన ఐఎంఎఫ్, ఇక్రా
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును జనవరిలో 5.8 శాతంగా అంచనా వేసిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తాజాగా 1.9 శాతానికి తగ్గించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో వృద్ధిపై భారీగా ప్రభావం పడుతుందని తెలిపింది. అదే సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం అంచనా వేయగా, ఇప్పుడు దీనిని 4.2 శాతానికి తగ్గించింది. అయితే ఇక్కడ ఓ విషయం ఏమంటే చైనా కాకుండా పాజిటివ్ వృద్ధిని నమోదు చేసే దేశాల్లో భారత్ మాత్రమే ఉండటం గమనార్హం. భారత్ విషయానికి వస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోలుకొని వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుకుంటుందని IMF అంచనా వేసింది.
అంతర్జాతీయ వృద్ధి దారుణంగా పడిపోతుందని IMF అంచనా వేసింది. 1930 తర్వాత అంతర్జాతీయ వృద్ధి రేటు 2020 క్యాలెండర్ ఇయర్లో దారుణంగా ఉంటుందని, అయితే 2021 నాటికి కాస్త పుంజుకుంటుందని తెలిపింది. 2021లో అంతర్జాతీయ వృద్ధి రేటు 3.4 శాతంగా ఉంటుందని జనవరిలో IMF అంచనా వేసింది. ఇప్పుడు మూడు శాతం తగ్గుతుందని అంచనా వేస్తోంది. 2008-09 ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత సంక్షోభం ఘోరమని పేర్కొంది.

ఇక్రా (ICRA) కూడా భారత వృద్ధి రేటు అంచనాను భారీగా తగ్గించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 1 శాతం మేర తగ్గవచ్చునని తెలిపింది. అంతకుముందు 3 శాతంగా అంచనా వేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో భారత వృద్ధి రేటు అంచనాను అంతకుముందు ఉన్న 2.5 శాతం నుండి 0.0 శాతానికి కుదించింది బార్క్స్లే ఎమర్జింగ్ మార్కెట్స్ రీసెర్చ్. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును 3.5 శాతం నుండి 0.8 శాతానికి కుదించింది. ఇక్రా, ఐఎంఎఫ్ కూడా సమీక్షించాయి.


Click it and Unblock the Notifications