పాతాళానికి భారత వృద్ధి రేటు.. దాదాపు డబుల్ డిజిట్
కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో భారత వృద్ధిరేటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అలాగే జూన్ క్వార్టర్‌లో వృద్ధిరేటులో క్షీణత మైనస్ 25 శాతం వరకు ఉండవచ్చునని పేర్కొంది. దేశంలో అన్-లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఇంకా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని గుర్తు చేసింది. దీంతో మే, జూన్ నెలల్లో కన్పించిన వృద్ధి తెరమరుగైందని తెలిపింది.

కనిష్టస్థాయికి...
ఇప్పటి వరకు ఏ దేశీయ, అంతర్జాతీయ సంస్థ లేదా ఏజెన్సీ ప్రకటించనంత కనిష్ఠస్థాయి ఇది కావడం గమనార్హం. అలాగే ఇక్రా గతంలో ప్రకటించిన అంచనా మైనస్ 5 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. వృద్ధి రేటు రాబోయే క్వార్టర్‌లలో కూడా నిరాశావహంగానే ఉంటుందని చెబుతున్నారు. సెప్టెంబర్‌తో ముగియనున్న రెండో క్వార్టర్‌లో మైనస్ 12.4%, డిసెంబర్‌తో ముగియనున్న క్వార్టర్‌లో మైనస్ 2.3% క్షీణత నమోదు కావొచ్చునని ఇక్రా వెల్లడించింది.

మార్చి క్వార్టర్‌లో 1.3 శాతం
వచ్చే ఏడాది మార్చి క్వార్టర్‌కు మాత్రం 1.3% వృద్ధిని చూడవచ్చునని ఇక్రా అంచనా వేసింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపులతో దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయని, దాంతో కొన్ని రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధిస్తుండటం వృద్ధి రికవరీకి అంతరాయంగా మారిందని ఇక్రా ఆర్థికనిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

వ్యాక్సీన్ రావొచ్చు..
కరోనా మహమ్మారి స్థూల జాతియోత్పత్తిపై పెను ప్రభావం చూపుతోందని ఇక్రా తెలిపింది. రెండో క్వార్టర్‌లో భారీగా నష్టపోయి, మూడో క్వార్టర్‌లో ప్రతికూలత తగ్గుతుందని, నాలుగో క్వార్టర్ నాటికి సానుకూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. అప్పటికి వ్యాక్సీన్ కూడా రావొచ్చునని, అది కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అప్పటికి ట్రావెల్, హాస్పిటాలిటీ, వినోదం వంటివి కోలుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. దేశంలో కరోనా కేసులు పది లక్షలు దాటాయి. 26 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.


Click it and Unblock the Notifications