ఏడాదంతా ఇంతే.. ఆటో సేల్స్ స్థిరంగా ఉంటుందా?
కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటును సవరిస్తున్నాయి. మొదటి త్రైమాసికం జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన నేపథ్యంలో ఇక్రా సవరించింది. కరోనా కేసులు కూడా దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. దీంతో FY21 వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 9.5 శాతాన్ని సవరించి 11 శాతానికి పెంచింది. రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు అంచనాను మైనస్ 12.4 శాతం వద్దే ఉంచింది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో కూడా వృద్ధి రేటు ప్రతికూలంగానే ఉంటుందని అంచనా వేసింది. అయితే అంతకుముందు అంచనాల్లో చివరి క్వార్టర్‌లో వృద్ధి రేటు కాస్త సానుకూలంగా ఉంటుందని పేర్కొంది. కానీ ఇప్పుడు ప్రతికూలత అంచనా వేస్తోంది.

ఏడాదంతా ప్రతికూలత
2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో వృద్ధిరేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. రెండో క్వార్టర్‌లో 12.4 శాతం ప్రతికూలత ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంతో పోలిస్తే చివరి ఆరు నెలల కాలంలో పుంజుకుంటుందని ఇక్రా అంచనా వేస్తోంది. అయితే మూడు, నాలుగు క్వార్టర్‌ల అంచనాలను సవరించినట్లు తెలిపింది. మూడో త్రైమాసికంలో గతంలో మైనస్ 2.3 శాతం అంచనా వేయగా, తాజాగా దీనిని మైనస్ 5.4 శాతానికి సవరించింది. చివరి క్వార్టర్‌లో 1.3 శాతం వృద్ధి ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజా సవరణ ప్రకారం మైనస్ 2.5 శాతం అంచనా వేసింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో అసమానంగా..
రంగాలవారీగా నిర్మాణం, వాణిజ్యం, రవాణా, హోటల్స్, కమ్యూనికేషన్స్, సేవలు వంటి రంగాలు క్రమంగా కోలుకునే అవకాశాలు ఉన్నట్లు ఇక్రా భావిస్తోంది. మిగతా రంగాలు అప్పుడే కోలుకునే అవకాశం లేదని తెలిపింది. వివిధ రంగాల ప్రభావం కారణంగా చివరి క్వార్టర్‌లోను వృద్ధి రేటు ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ అసమానంగా కోలుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

డిమాండ్ స్థిరంగా ఉంటందా
జూలై, ఆగస్ట్ రికవరీ సూచి ఆధారాన్ని బట్టి రెండో క్వార్టర్‌లో అసమాన రికవరీ ఉంటుందని తెలిపింది. ఇటీవలి కాలంలో ఆటో సేల్స్ పెరిగాయి. పాసింజర్ వెహికిల్స్, మోటార్ సైకిల్స్ అమ్మకాలు పెరిగినప్పటికీ డిమాండ్ పెరుగుదల, అమ్మకాల స్థిరత్వంపై కొన్ని సందేహాలు ఉన్నట్లు పేర్కొంది. కరోనా సామాజిక దూరం, ప్రజారవాణాకు దూరం ఉండేందుకు ఇటీవలి కాలంలో సేల్స్ పెరిగినట్లుగా భావిస్తున్నారు. వాస్తవ ఆటో సేల్స్ డిమాండ్ డిసెంబర్ నాటికి తెలుస్తుందని ఆటో కంపెనీలు భావిస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ వృద్ధి ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications