ముంబై: దేశంలో అతి పెద్ద ప్రైవేట కార్పొరేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ.. తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోంబే ఎక్స్ఛేంజ్‌కు సమర్పించింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో తన నికర ఆదాయాన్ని భారీగా పెంచుకోగలిగింది. ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీన ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 6,194 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. 25 శాతం మేర వృద్ధి రేటును అందుకుంది.
అన్ని రకాల పన్నుల చెల్లింపుల తరువాత (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్-పీఏటీ) 6,194 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకున్నట్లు వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే.. 25 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ అందుకున్న నెట్ ప్రాఫిట్ 5,511 కోట్ల రూపాయలు. మూడో త్రైమాసికంలో ఈ మొత్తాన్ని 25 శాతం మేరకు పెంచుకోగలిగింది. నికర వడ్డీ ఆదాయం 23 శాతం మెరుగుపడింది. 12,236 కోట్ల రూపాయలుగా చూపించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నమోదు చేసిన నికర వడ్డీ ఆదాయం 9,912 కోట్ల రూపాయలు. ఇప్పుడది 12,236 కోట్ల రూపాయలకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో 25 శాతం పెరుగుదల నమోదైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో 8,054 కోట్ల రూపాయలు కాగా.. థర్డ్ క్వార్టర్‌లో ఈ మొత్తం 10,060 కోట్లకు పెరిగింది. నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 3.96 శాతంగా నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 3.67 శాతం.
ఐసీఐసీఐ బ్యాంక్ తన మొత్తం డిపాజిట్ల విలువను 10,17,467 కోట్ల రూపాయలుగా పేర్కొంది. యావరేట్ డిపాజిట్లు 34 శాతం మేర పెరిగినట్లు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సమర్పించిన ప్రతిపాదనల్లో పొందుపరిచింది. మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ 50 శాతం మేర అంటే 4,55,326 కోట్ల రూపాయలు పెరిగినట్లు పేర్కొంది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, పీఓఎస్‌లల్లో 90 శాతం పురోభివృద్ధి రికార్డు చేసినట్లు వివరించింది.
నిరర్థక ఆస్తుల విలువ ఏకంగా 10 శాతం మేర తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీని విలువ 7,344 కోట్ల రూపాయలు. నికర ఎన్పీఏ శాతం 0.99 నుంచి 0.89 శాతానికి తగ్గినట్లు స్పష్టం చేసింది. రైటాఫ్, సేల్ పోను గ్రాస్ ఎన్పీఏ 191 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు ఈ ప్రతిపాదనల్లో పొందుపరిచింది. మార్చి 31వ తేదీ నాటికి ముగియనున్న చివరిదైన నాలుగో త్రైమాసికంలోనూ మెరుగైన ఫలితాలను అందుకుంటామని పేర్కొంది.


Click it and Unblock the Notifications