తనపై వచ్చిన ఆరోపణల మీద ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ స్పందించారు. తాను కంపెనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, రెండేళ్లుగా చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు. సీఈవో, సీఎఫ్ఓలు అనైతిక విధానాలకు పాల్పడ్డారని విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కంపెనీ బోర్డు దర్యాఫ్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో సలీల్ పరేఖ్ కంపెనీ ఇన్వెస్టర్ల సమావేశంలో స్పందించారు.
ఓ పెద్ద సంస్థలో ప్రధాన వ్యాపార పరివర్తనను అందించేందుకు రెండేళ్లుగా తాను చిత్తశుద్ధితో పని చేశారని, తన ఉద్యోగుల నుంచి వచ్చిన హృదయ పూర్వక సందేశాలకు థ్యాంక్స్ చెబుతున్నానని, ఆరోపణలపై బోర్డు చేపట్టిన దర్యాఫ్తు సంస్థపై తనకు గౌరవం ఉందని సలీల్ పరేఖ్ చెప్పారు. విచారణ ప్రక్రియకు తాను దూరంగా ఉంటున్నానని, తాను ఎంత కలుపుగోలుగా ఉంటానో తనతో కలిసి పని చేసిన వారికి తెలుసునని చెప్పారు.

ఇదిలా ఉండగా, టాప్ మేనేజ్‌మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందని గుర్తు తెలియని ఉద్యోగులు చేసిన ఆరోపణలపై ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని కూడా నిన్న స్పందించారు. విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు అవమానకరమైనవన్నారు. అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, దీనిపై తమ అభిప్రాయాలను రుద్దే ప్రసక్తి మాత్రం లేదన్నారు.
విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదుల వెనుక సహవ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను కూడా నందన్ నీలేకని కొట్టి పారేశారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications