ఇళ్ళ ధరల భారీగా పెరుగుదల, వరల్డ్ టాప్ 20లో హైదరాబాద్: అసలు విషయం ఇదీ!
2019లో దేశం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కనిపించింది. ఉద్యోగాల సృష్టి తగ్గడమే కాదు.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. అయితే ఇళ్లు, ప్లాట్ల ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది జూలై - సెప్టెంబర్ మధ్య కాలంలో ధరలు తొమ్మిది శాతం పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్భణం కంటే ఇది ఎక్కువ. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది.

ప్రపంచ టాప్ 20లో భారత్ నుంచి హైదరాబాద్ ఒక్కటే
ఈ జాబితాలో నివాస గృహాల ధర అత్యధికంగా పెరిగిన ప్రపంచంలోని నగరాల్లో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. హైదరాబాదులో వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. 24% పెరుగుదలతో బుడాపెస్ట్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాలోని జియాన్, యుహాన్ నగరాలు ఉన్నాయి. వీటి పెరుగుదల వరుసగా 15.9 శాతం, 14.9 శాతంగా ఉంది. టాప్ 20 జాబితాలో భారతదేశంలో ఒక్క హైదరాబాద్ మాత్రమే ఉండటం గమనార్హం. మరే భారత నగరానికి చోటు దక్కలేదు.

టాప్ 150లో 7 భారత నగరాలు
టాప్ 150లో మాత్రం ఏడు భారత నగరాలకు చోటు దక్కింది. 3.2 శాతం ధరల పెరుగుదలతో ఢిల్లీ 73వ స్థానంలో, 2 శాతం పెరుగుదలతో బెంగళూరు 94వ స్థానంలో ఉన్నాయి. 108వ స్థానంలో అహ్మదాబాద్, 130వ స్థానంలో కోల్‌కతా ఉన్నాయి.

ముంబై, చెన్నైలలో తగ్గిన భూముల ధరలు
ముంబై, చెన్నై, పుణే నగరాలలో భూముల ధరలు 3 నుంచి 3.5 శాతం మేర తగ్గాయి. ముంబై 135వ స్థానంలో, చెన్నై 136వ స్థానంలో ఉంది. ఈ రెండు నగరాల్లో ఇళ్ల ధరలు 3 శాతం మేర తగ్గాయి. పుణేలో 3.5 శాతం మేర తగ్గి 138వ స్థానంలో నిలిచింది.

150 నగరాల్లో 3.2 శాతం మేర పెరుగుదల
ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సగటున 3.2 శాతం మేర ధరలు పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం నుంచి ఇదే అత్యంత బలహీనం. భారత్‌లోని నగరాల్లో గృహాల ధరల వృద్ధి అనేది రిటైల్ ద్రవ్యోల్బణం కంటే దిగువలో ఉంది. ఈ అంతరం 2016 హెచ్1 నుంచి పెరుగుతోంది.

హైదరాబాదులో ఎందుకు పెరిగిందంటే
హైదరాబాదులో నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ప్రారంభం కాలేదని, దీంతో అప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలిపింది. దీంతో డెవలపర్లు ఎక్కువగా డిమాండ్ వచ్చిందని, దీంతో ధరల పెరుగుదల గణనీయంగా పెరిగిందని పేర్కొంది.


Click it and Unblock the Notifications