సస్సెండ్ అయిన తహసీల్దార్ అక్రమార్జన రూ. 50 కోట్ల పైమాటే.. చంచల్‌గూడ మహిళా జైలులో తుమ్మకొమ్మ సుచరిత..
గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్‌గా పనిచేసి, ప్రస్తుతం లంచం కేసులో సస్పెన్షన్‌లో ఉన్న తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జనపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తీవ్రమైన నిఘా పెట్టారు. ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో ఆమె నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరులకు చెందిన మరో మూడు ప్రాంతాలలో విస్తృత సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భారీ ఎత్తున స్థిరాస్తులు, బంగారం, వజ్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధుశర్మ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఆస్తుల ప్రభుత్వ డాక్యుమెంట్ విలువ రూ. 5,05,52,465 గా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి అసలు విలువ రూ. 50 కోట్లకు పైనే ఉండవచ్చని భావిస్తున్నారు.

గురువారం నాటి సోదాల్లో సుచరితకు సంబంధించి సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం దామరకుంటలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. దీనితో పాటు హైదరాబాద్‌లోని వివిధ కీలక ప్రాంతాల్లో 3 ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో రెండు నివాస స్థలాలను కనుగొన్నారు. కేవలం స్థిరాస్తులే కాకుండా రూ. 1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, ఇంట్లో దాచిన రూ. 12 లక్షల నగదు, వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ. 38 లక్షల నిల్వలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు ఆమె వాడుతున్న వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా వంటి రెండు కార్లను కూడా అధికారులు సీజ్ చేశారు.
ఈ అక్రమాస్తుల వ్యవహారానికి ముందే సుచరిత ఒక భారీ లంచం కేసులో దొరికిపోవడం గమనార్హం. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి కొందరు రైతులు దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో తహసీల్దార్‌గా ఉన్న సుచరిత ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేశారు. రైతుల అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో తీసుకోవడానికి అంగీకరించినప్పటికీ, బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో గత మే 26న మధ్యవర్తి ద్వారా మొదటి విడతగా రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సుచరిత ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా, ఏసీబీ అధికారులు తాజాగా ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.


Click it and Unblock the Notifications
