IT News: పెరుగుతున్న జనాభాను నిలువరించేందుకు పలు దేశాలు నానా తంటాలు పడ్డాయి. నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ సంతానం ఉంటే భారీగా ఆంక్షలు విధించేందుకు సైతం వెనకాడలేదు. అయితే ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆయా దేశాల్లో జనాభా సరిపోక వలసదారులను చేతులు జోడించి ఆహ్వానించాల్సి వస్తోంది. మరికొన్ని స్వదేశీయులకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి.
భారత్ వంటి దేశాల్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు అధికంగా ఉంటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పలువురు మిలియనీర్లు దేశం దాటుతున్నారు. అయితే ఐరోపాలోని హంగేరి మాత్రం తన పౌరులకు పూర్తి జీవితాంతం ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తానని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. కానీ దానికి ఓ షరతు విధించింది.

దేశీయ యువతలో వివాహాలతో పాటు కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేందుకుగాను హంగేరి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వలస దారులను అరికట్టడంతో పాటు స్థానిక ప్రజలను జనాభా పెరుగుదల దిశగా నడిపిస్తోంది. ఇందుకోసం సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని విక్టర్ ఓర్బన్ అనౌన్స్‌మెంట్ చేశారు. కనీసం నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన వారికి పన్ను పోటు ఉండదని వెల్లడించారు.
కేవలం ఇదే కాకుండా పెద్ద కుటుంబాల కోసం కార్లను కొనుగోలు చేసేందుకు సబ్సిడీని కూడా హంగేరి ప్రకటించింది. జనాభాను పెంచే ప్రణాళికలలో భాగంగా 21 వేల క్రెచ్ ప్లేస్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఆ దేశం ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం కూడా సబ్సిడీ రుణాలతో వివాహం మరియు ప్రసవం అనౌన్స్ చేసి సంచలనం సృష్టించింది. 40 ఏళ్లకు ముందే వివాహం చేసుకునే జంటలకు దాదాపు 33 వేల డాలర్లు సబ్సిడీ రుణాలు ఇస్తామని గతంలో పేర్కొంది. పిల్లల సంఖ్యను బట్టి ఆ రుణంలో మూడో వంతు నుంచి పూర్తిగా మాఫీ చేస్తామని ఆఫర్ చేసింది.


Click it and Unblock the Notifications