భారతదేశంపై డ్రాగన్ కంట్రీ చైనా అనేక అనధికారిక వాణిజ్య ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో ఇండియాలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమకు భారీ ముప్పు వాటిల్లనుంది. దేశ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనా విధించిన ఆంక్షలు మనదేశ ఎగుమతులను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. కాగా 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 32 బిలియన్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చైనా తాజాగా తీసుకున్న చర్యల కారణంగా ఈ లక్ష్యం సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 64 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసింది. ఈ సారి దీన్ని క్రాప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం మధ్య చైనా ఆంక్షలు కాక రేపుతున్నాయి.
చైనా ఆంక్షలు వెనుక స్వార్ధం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇండియా సరఫరా గొలుసును ప్రభావితం చేయడంతో పాటుగా ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందడాన్ని బలహీనపరచడమే చైనా ఆంక్షల ఏకైక ఉద్దేశ్యం అని పరిశ్రమల సంఘం ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. చైనా విధించిన ఆంక్షల కారణంగా కంపెనీల ఖర్చులు పెరుగుతున్నాయి. ICEAలో ఆపిల్, గూగుల్, మోటరోలా, ఫాక్స్‌కాన్, వివో, ఒప్పో, లావా, డిక్సన్, ఫ్లెక్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.

చైనా భారతదేశంపై ఎందుకు అంత నిషేధం విధిస్తోందనే ప్రశ్నకు సమాధానం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగుమతులుగా చెప్పుకోవచ్చు. 2020 నుండి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం పుంజుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 64 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసింది. అందులో 24.1 బిలియన్ డాలర్లు విదేశాలకు ఎగుమతి చేయబడింది. 2015 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 167వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ప్రధాన ఎగుమతిదారుగా మారింది. ఈ ఊపుతోనే 2026 నాటికి ఎగుమతులు 32 బిలియన్ డాలర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పరిస్థితుల మధ్య ఆపిల్ తన తయారీ ప్లాంట్లను చైనా నుండి భారతదేశానికి మారుస్తున్న సంగతి విదితమే. ఇక్కడి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది. ఇది చైనాకు మింగుడుపడటం లేదు. దాదాపు 5 సంవత్సరాల క్రితం వరకు ఆపిల్ తన ఐఫోన్‌లన్నింటినీ చైనాలోనే తయారు చేసేది. 2020లో మన దేశంలో ప్రారంభించబడిన స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం భారతదేశ PLI పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. అమెరికన్ కంపెనీ ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా భారతదేశంలో తన ఉత్పత్తిని వేగంగా పెంచుకుంటూ పోతోంది. ఇది ప్రపంచ ఐఫోన్ తయారీలో 20 శాతం వాటా కలిగి ఉంది. భారత్ అభివృద్ధిని చైనా జీర్ణించుకోలేక పోతోంది. అందుకే ఆంక్షలు విధించింది.
చైనా తాజాగా తీసుకున్న చర్యతో భారతదేశానికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. చైనా తాజాగా తీసుకున్న నిర్ణయం భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ వృద్ధి ఇంజిన్‌ను ప్రమాదంలో పడేస్తోందని ICEA పేర్కొంది. దీనికి పరిష్కార మార్గం కనుగొనకపోతే ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం వాటా గణనీయంగా తగ్గుతుంది, దీని కారణంగా 2030 నాటికి భారతదేశం 155 బిలియన్ డాలర్ల తయారీ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలోనే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రానిక్స్ తయారు చేయడానికి భారతదేశం మరొక ఎంపిక కోసం చూస్తోంది.
అయితే ఇక్కడ ఉన్న అతిపెద్ద సమస్య అరుదైన భూమి ఖనిజాలకు (రేర్ ఎర్త్) సంబంధించినది. ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భారతదేశానికి అరుదైన భూమి రవాణాను చైనా నిలిపివేసింది. దీనితో పాటు మూలధన పరికరాలు, ఇతర ఖనిజాల రవాణాను కూడా చైనా ఆపేసింది. సాంకేతిక బదిలీని నిలిపివేయడానికి చైనా తన ఉద్యోగులను స్వదేశానికి తిరిగి వెళ్లాలని కూడా ఆదేశించింది. దీంతో పాటుగా భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని కొన్ని కంపెనీలను కూడా చైనా కూడా ఆదేశించింది. చైనా యొక్క ఈ చర్యల కారణంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ముప్పు పెరుగుతోంది. భారత్ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది ఇప్పుడు.


Click it and Unblock the Notifications