ఇతర కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ దేశాలతో పోలిస్తే మన దేశంలో కార్ల పైన ఎక్కువ పన్నులు ఉన్నాయని, అందుకే మన వద్ద ఎక్కువమంది కొనలేకపోతున్నారని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. కరోనా కారణంగా మార్చి నుండి వాహనాల సేల్స్ పడిపోయిన విషయం తెలిసిందే. జూలైలో మాత్రం పుంజుకున్నాయి. కరోనా అంశాన్ని పక్కన పెడితే సాధారణంగా కార్ల కొనుగోలుకు సంబంధించి భార్గవ స్పందించారు.

ఎన్నో దేశాల కంటే మన వద్ద పన్నులు ఎక్కువ
ఇండియాలో కార్లపై విధిస్తున్న అధిక సుంకాలు, పన్నుల వల్ల అత్యధికులు కొనుగోలు చేయలేకపోతున్నారని ఆర్సీ భార్గవ అన్నారు. జపాన్‌లో 10 శాతం, ఐరోపాలో 19 శాతం వ్యాట్ ఉందని ఇతర పన్నులు అక్కడ ఉండవని చెప్పారు. కానీ మన వద్ద భారీగా పన్నులు ఉంటాయన్నారు. 28 శాతం జీఎస్టీతో పాటు 1 శాతం నుండి 22 శాతం సుంకాలు ఉన్నాయి. మన దేశంలో ఆదాయాలు తక్కువ అని, దీనికి పన్నులు ఎక్కువ కావడంతో ఔత్సాహికులు తగ్గుతున్నట్లు తెలిపారు.

పన్నులతో పాటు రుణాలు భారం
పన్నులు సహా కారు ధర అధికం కావడంతో పాటు రుణాలు పొందడం కూడా భారంగా మారిందని ఆర్సీ భార్గవ అన్నారు. అందుకే విక్రయాలు తగ్గాయని చెప్పారు. వాహన రంగంలో 50 శాతం వాటా కార్లదేనని, తయారీ రంగంలో 40 శాతం వాటా వాహన రంగానిది ఉన్నట్లు తెలిపారు. మార్చి నుండి కరోనా ప్రభావం ఆటో రంగంపై తీవ్రంగా పడినట్లు తెలిపారు.

జీడీపీలో 25 శాతం వాటాకు చేరుకోవాలంటే
గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీ భార్గవ మాట్లాడుతూ.. కారు కొనుగోలుకు అయ్యే ఖర్చు పెరుగుదల, రుణం పొందడానికి అడ్డంకులు కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణమైనట్లు తెలిపారు. 2025 నాటికి జీడీపీలో మ్యానుప్యాక్చరింగ్ వాటా 25 శాతానికి చేరుకోవాలంటే కార్ల అమ్మకాలు వేగంగా పెరగాల్సి ఉందని చెప్పారు. పాసింజర్ వెహికిల్స్ పైన 28 శాతం జీఎస్టీ ఉంది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లపై 1 శాతం ట్యాక్స్ నుండి ఎస్‌యూవీ కార్లపై 22 శాతం వరకు పన్నులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications