యూరోపియన్ దేశం అయిన స్పెయిన్ లో ఇండియన్ రెడీ మేడ్ గార్మెంట్స్ కు బాగా డిమాండ్ ఉందని, భారతీయ దుస్తుల తయారీదారులకు అపారమైన అవకాశముందని ఎఇపిసి పేర్కొంది. స్పెయిన్ దేశం ఇతర దేశాల నుండి గణనీయంగా వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో స్పెయిన్లో తమ ఎగుమతులను పెంచడానికి రెడీమేడ్ గార్మెంట్ తయారీదారులతో సహా భారతీయ దుస్తుల తయారీదారులకు మంచి అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది.

దేశ ఎగుమతులు స్పెయిన్ మార్కెట్లో కేవలం 4.2 శాతం మాత్రమే
2019 వ సంవత్సరంలో 817.6 మిలియన్ డాలర్ల ఎగుమతితో స్పెయిన్ కు భారతదేశం ప్రస్తుతం ఏడవ అతిపెద్ద రెడీమేడ్ వస్త్ర సరఫరాదారుగా ఉందని అపరెల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ స్పష్టం చేసింది. స్పెయిన్ మార్కెట్ చాలా పెద్దదని మన దేశ ఎగుమతులు స్పెయిన్ మార్కెట్లో కేవలం 4.2 శాతం మాత్రమే అని అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎఇపిసి) తెలిపింది. స్పెయిన్ యొక్క ప్రపంచ దిగుమతి అపెరల్స్ 7,629 మిలియన్ డాలర్లు, అందులో భారతదేశం నుండి దిగుమతులు కేవలం 217.6 మిలియన్ డాలర్లు, మార్కెట్ వాటా కేవలం 2.9 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.

భారతదేశం ఇంకా ఎగుమతులు పెంచడానికి స్పెయిన్ లో కావలసినంత స్కోప్
భారతదేశం ఇంకా ఎగుమతులు పెంచడానికి కావలసినంత స్కోప్ ఉందని పేర్కొంది. అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నిర్వహించిన ‘ఇండియా-స్పెయిన్ సినర్జీస్ ఇన్ అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్' లో స్పెయిన్ భారత డిప్యూటీ అంబాసిడర్ మదన్ సింగ్ భండారి మాట్లాడుతూ, భారతదేశంలో ఈ రంగంలో ఇటీవల జరిగిన మార్పులను పరిశీలిస్తే భారత దుస్తులు తయారీదారులు స్పెయిన్‌కు ఎగుమతులను గణనీయంగా పెంచవచ్చునని పేర్కొన్నారు.

స్పెయిన్ కు వస్త్ర ఎగుమతులు పెరిగే అవకాశం : భారత డిప్యూటీ అంబాసిడర్ మదన్ సింగ్ భండారి
స్పెయిన్‌లో భారతీయ ఉత్పత్తుల మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, స్పెయిన్ వస్త్ర దిగుమతుల్లో భారతదేశం యొక్క వాటా చాలా తక్కువగా ఉందన్నారు.ఈ మధ్యకాలంలో భారతదేశం అనేక నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టినందున భారతదేశం నుండి స్పెయిన్ కు వస్త్ర ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని , భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూలత పెరుగుతోంది అని ఆయన స్పష్టం చేశారు.

గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతుల పెరుగుదల బాగుంది : అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ ఎ శక్తివేల్
అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ ఎ శక్తివేల్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా కౌన్సిల్ భారతదేశం పట్ల సానుకూల భావనను చూపిస్తోంది అన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతుల పెరుగుదల బాగా ఉందని, తాము వైద్యులకు కావాల్సిన వస్త్రాలు, పీ పీ కిట్స్ , సాంకేతిక వస్త్రాలు మరియు రెడీమేడ్ వస్త్రాల ఉత్పత్తిని పెంచడంతో ఈ కరోనా సంక్షోభం ఒక అవకాశంగా మారిందని శక్తివేల్ తెలిపారు. మొత్తానికి స్పెయిన్ లో భారతీయ వస్త్రాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా వస్త్ర ఉత్పత్తి ని, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.


Click it and Unblock the Notifications