భారీగా పెరిగిన బంగారం ధరలు, గోల్డ్ లోన్స్ అనూహ్యంగా జంప్
కరోనా మహమ్మారి కారణంగా ఓ వైపు చేతిలో డబ్బులు లేకపోవడం, మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడంతో గోల్డ్ లోన్స్‌కు డిమాండ్ పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక తెలిపింది. గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా పెరుగుతోందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ రూ.4.6 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని WCG అంచనా వేసింది. కరోనా సమయంలో డబ్బుల అవసరానికి తోడు ధరలు పెరగడం కూడా దోహదపడింది. కరోనా నేపథ్యంలో మార్చి నుండి పసిడి ధరలు వేగంగా పెరిగిన విషయం తెలిసిందే. రూ.40వేల లోపు ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.50వేలకు పైగా ఉంది.

అంతకంతకూ గోల్డ్ లోన్ మార్కెట్ పెరుగుదల
2021-22 ఆర్థిక సంవత్సరానికి గోల్డ్ లోన్ మార్కెట్ 15.7 శాతం పెరిగి 62.8 బిలియన్ డాలర్లకు (రూ.4,61,700 కోట్లు) చేరుకోవచ్చునని అంచనా వేసింది. గోల్డ్ లోన్ మార్కెట్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 47 బిలియన్ డాలర్లు (రూ.3,44,800 కోట్లు)గా ఉంది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ పరిమాణం రూ.4,05,100 కోట్లకు చేరుకోవచ్చునని తెలిపింది. కరోనా కాలంలో బంగారు రుణాలకు డిమాండ్ 28.8 శాతం పెరిగింది. ఫలితంగా ప్రధాన ఎన్బీఎఫ్‌సీల ఏఎంయు (అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం నుండి 20 శాతం మేర పెరగవచ్చునని WGC అంచనా వేసింది.

భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి రుణాలు జంప్
బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇచ్చే సంస్థలు చిన్నవ్యాపారులు, కుటుంబాలకు అత్యవసర సమయాల్లో అండగా ఉంటున్నాయని, ఏ పసిడి మార్కెట్‌లో అయినా సంస్థాగతేర రుణాలు సమాంతరంగా నడుస్తుంటాయని WGC ఎండీ(ఇండియా) సోమసుందరం తెలిపారు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఇచ్చే పసిడి రుణాలకు కూడా డిమాండ్ పెరిగిందని తెలిపింది. జూలై 2019 నుండి బంగారం ధర 29 శాతం మేర పెరగడం కలిసి వచ్చినట్లు తెలిపింది. మున్ముందు కూడా పసిడి రుణాలకు సానుకూలతలు కనిపిస్తున్నాయని తెలిపింది.

భారీగా పెరిగిన పసిడి ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు నిన్న (మంగళవారం, నవంబర్ 10) భారీగా పెరిగాయి. 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.701.00 (1.41%) పెరిగి రూ.50,449 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.632 (1.27 శాతం) పెరిగి రూ.50,525 వద్ద ముగిసింది.
డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.2,013.00 (3.31%) పెరిగి రూ.62,867.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.2,117.00 (3.38%) పెరిగి రూ.64,720.00 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications