Tax Collections: దేశంలో పన్నుల వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రతినెలా పెరుగుతూనే పోతున్నాయి. భారీ వసూళ్లతో 2023 ఘనంగా ముగిసినట్లు తెలుస్తోంది. డిసెంబరులో ట్యాక్స్ రాబడిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు డిసెంబరులో 10 శాతం పెరిగి దాదాపు 1.64 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం 1.49 లక్షల కోట్లుగా పేర్కొంది. ఏప్రిల్-డిసెంబర్ 2023 మధ్య కాలంలో స్థూల GST వసూళ్లు 14.97 లక్షల కోట్లను టచ్ చేసినట్లు చెప్పింది.

అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ నాటికి వసూలు చేసిన GST మొత్తం 13.40 లక్షల కోట్లని ప్రకటించింది. అంటే 2022తో పోలిస్తే 12 శాతం వృద్ధిని సాధించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక ఈ ఏడాది మొదటి 9 నెలల్లో సగటు నెలవారీ స్థూల GST వసూళ్లు 1.66 లక్షల కోట్లుగా పేర్కొంది. FY23లో నమోదైన 1.49 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు వివరించింది.
'డిసెంబర్, 2023లో సేకరించిన స్థూల GST రాబడి లక్షా 64 వేల 882 కోట్లు. అందులో CGST 30 వేల 443 కోట్లు, SGST 37 వేల 935 కోట్లు, IGST 84 వేల 255 కోట్లు మరియు సెస్ 12 వేల 249 కోట్లు. దిగుమతులపై సేకరించిన సుంకం 41 వేల 534 కోట్లు, సెస్ 1,079 కోట్లు ఇందులోనే కలిపి ఉన్నాయి' అని స్పష్టం చేసింది. ఈ విధంగా 1.60 లక్షల కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాదిలో ఇది ఏడోసారి కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications