హైదరాబాద్ సహా ఈ 4 విమానాశ్రయాల పూర్తి ప్రయివేటీకరణ!
ప్రభుత్వం పలు విమానాశ్రయాలను పూర్తిగా ప్రయివేటీకరించే యోచనలో ఉంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలు ఇప్పటికే ప్రయివేట్ అయ్యాయి. అయితే వీటిల్లో ఇప్పటికే ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా విక్రయించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా వీటిని ప్రయివేటీకరించి నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఆస్తుల విక్రయం ద్వారా రూ. 2.5 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని చూస్తోంది. గత నెలలో అత్యున్నత కార్యదర్శుల కమిటీ ఈ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

మిగిలిన వాటాల విక్రయం
ఇప్పటికే ప్రయివేటైజ్ చేసిన విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలిన వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఉందని చెబుతున్నారు. ఈ నాలుగు విమానాశ్రయాల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ(AAI)కు ఉన్న వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 13 ఎయిర్ పోర్టులను ప్రయివేటైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆకర్షణీయ ప్యాకేజీ
పై నాలుగు ఎయిర్ పోర్టుల భాగస్వామ్య సంస్థల్లో AAIకు ఉన్న వాటాల విక్రయంపై పౌర విమానయాన శాఖ తగిన అనుమతులను పొందనున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అనుమతుల అంశం కేంద్ర కేబినెట్‌కు చేరవచ్చు. వచ్చే ఏడాదిలో ప్రయివేటైజ్ చేయనున్న జాబితాలోని లాభదాయకం, లాభదాయకం కాని 13 ఎయిర్ పోర్టులను కలగలపడం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీ దిశగా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. మొదటి రౌండ్ ప్రయివేటైజేషన్‌లో భాగంగా అదానీ గ్రూప్.. లక్నో, జైపూర్, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయాలను దక్కించుకుంది. AAI నిర్వహణలో దేశవ్యాప్తంగా 100కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వాటా
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం జీఎంఆర్ వాటా 63 శాతంగా ఉంది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు 13 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, మలేషియా ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాద్‌కు 11 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications