గుడ్‌న్యూస్: సెప్టెంబర్‌లో మోడీ ప్రభుత్వం మరో కరోనా ప్యాకేజీ!
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంపెనీలు, సంస్థలు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంస్థలను తద్వారా ఉద్యోగులను ఆదుకునేందుకు ఇప్పటికే రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రం ఈ సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో మరో ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ డైరెక్టర్ ఎస్ గురుమూర్తి వెల్లడించారు.

21 లక్షల ప్యాకేజీ మధ్యంతర ఉపశమనం
మంగళవారం భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, ఇది మధ్యంతర ఉపశమనమేనని, కరోనా అనంతరం చివరి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇది సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో ఉండవచ్చునని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ద్వారా వచ్చే నగదును వినియోగించుకునే క్రమంలో ప్యాకేజీని రూపొందించిందని తెలిపారు.

నగదు ముద్రణకు తక్కువ అవకాశం.. ఐనా
నోటు నగదీకరణ ద్వారా అమెరికా, యూరోపియన్ దేశాల తరహాలో నగదును ముద్రించుకుంటూ రావడం భారత్‌కు తక్కువ అవకాశాలు ఉన్నాయని గురుమూర్తి చెప్పారు. అలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ స్వల్పమే అన్నారు. అయినా ద్రవ్యలోటుపై ఆర్బీఐ ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. భారత్ భిన్న రకాలైన సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు.

జన్ ధన్ నుండి తక్కువ మంది తీసుకున్నారు
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ప్రభుత్వం జన్ ధన్ అకౌంట్లలో రూ.16,000 కోట్ల మొత్తాన్ని జమ చేసిందని, కానీ అనూహ్యంగా కొద్దిమంది మాత్రమే ఈ నగదును ఉపసంహరించుకున్నారని గురుమూర్తి తెలిపారు. కరోనా అనంతరం ప్రపంచం బహుళ ఒప్పందాల నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మళ్లే అవకాశముందన్నారు. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థ కూడా శరవేగంగా కోలుకుంటుందన్నారు.


Click it and Unblock the Notifications