ఢిల్లీ: ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దిగుమతులు పడిపోయాయి. దీంతో ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. ఓ వైపు పంట దెబ్బతిని రైతులు నష్టపోగా, మరోవైపు పెరిగిన ధరలు సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల ధరలు పెంచారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర రూ.50 నుండి రూ.100 పలుకుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా వరకు పంట నష్టం జరగగా, ఉన్న కొద్ది సరుకు కూడా సరఫరా ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిగుమతులపై సడలింపులు
ఉల్లి దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఉల్లి సరఫరాను పెంచేందుకు డిసెంబర్ 15వ తేదీ వరకు దిగుమతులపై ఉన్న నిబంధనలలో కొన్ని సడలింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 15వ తేదీ వరకు ఉల్లి దిగుమతుపై నిబంధనల్లో సడలింపులు ఇస్తున్నామని, అలాగే మార్కెట్లో ధర పెరుగుదల నేపథ్యంలో స్టోరేజ్‌లో ఉన్న ఉల్లిని మార్కెట్‌కు రప్పించే ప్రయత్నాలు చేపట్టామని కేంద్రం తెలిపింది. ఖరీఫ్ పంట ద్వారా 37 లక్షల టన్నుల ఉల్లి రావాల్సి ఉందని, అది వస్తే ధరలను నియంత్రించవచ్చునని వెల్లడించింది.

ఊహించని పరిమాణం
వర్షాలు, వరదల కారణంగా ఉల్లి కొరత హఠాత్తుగా వచ్చింది. దీంతో ఉల్లి దిగుమతులను పెంచేలా ఇతర దేశాలలోని ట్రేడర్లతో సంప్రదింపులు భారత హైకమిషనర్ చర్చలు జరుపుతున్నారు. ట్రేడర్స్ ఇరాన్, ఈజిప్ట్ నుండి ఉల్లిని దిగుమతి చేసుకోనున్నారు. సాధారణంగా నవంబర్ చివరివారంలో ఉల్లి కొరత కనిపిస్తుందని, ఈసారి అక్టోబర్‌లోనే ఊహించని పరిణామం అని ఉల్లి ట్రేడర్లు అంటున్నారు.

భారీగా పెరిగిన ధరలు
సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకారం గత పది రోజుల్లో ఉల్లి ధరలు కిలోకు రూ.11.56 పెరిగి రూ.51.95కు చేరుకుంది. గత ఏడాది 12.13 శాతం పెరిగి రూ.46.33కు చేరుకోగా, ఈసారి అంతకంటే ఎక్కువ పెరిగింది. ఒకటి రెండు రోజుల్లోనే అరవై రూపాయల వరకు పెరిగింది. రైతు బజార్లలో ఈ నెల 19వ తేదీన రూ.24 ఉన్న ధర 21వ తేదీ నాటికి రూ.60 పెరిగి రూ.84కు చేరుకుంది. ఉల్లి ధరలు ఈ ఆగస్ట్ చివరి వరకు గత ఏడాది అక్టోబర్ 18వ తేదీ వరకు ఉన్న ధరలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో రూ.100 వరకు కూడా పలుకుతోందట. తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు ఉల్లి సరఫరా నిలిచిపోయింది. మిగతా రాష్ట్రాల్లోను అదే పరిస్థితి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టం ఎక్కువే ఉంది. తడిచిపోవడంతో ఉల్లి కుళ్లిపోయింది. వర్షాకాలంలో ఏపీలో 15వేల హెక్టార్లు, తెలంగాణలో ఐదున్నర వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తారు. కానీ పంట నష్టం జరిగింది.

అక్కడి నుండి రావాలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉల్లి పంట ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు, వరదలతో పంటనష్టం జరిగింది. రాజస్థాన్, గుజరాత్‌ల నుండి కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుండి రావాల్సి ఉంది. గోదాముల్లోని సరుకును కేంద్రం మార్కెట్లకు తరలించేందుకు సిద్ధమైంది. అలాగే, దిగుమతులు పెంచేందుకు నిబంధనల్లో స్వల్ప సడలింపులు ఇచ్చింది. కాబట్టి త్వరలో ధరలు దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications