ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం Employees Provident Fund Organisation (EPFO) కింద అమల్లో ఉన్న వేతన పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుపుతోంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటివరకు EPFO పరిధి బయట ఉన్న లక్షలాది ఉద్యోగులు సామాజిక భద్రత పరిధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.
EPFO వేతన పరిమితి అంటే.. ఎంత జీతం వరకు తప్పనిసరిగా ఉద్యోగి, యజమాని ప్రావిడెంట్ ఫండ్ (PF).. అలాగే Employees Pension Scheme (EPS) కింద కంట్రిబ్యూషన్ చెల్లించాలి అనే గరిష్ట హద్దుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది రూ. 15 వేలుగా ఉంది. అంటే నెలకు రూ. 15 వేల కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా EPFO పరిధిలోకి రావాల్సిన అవసరం లేదు. ఫలితంగా.. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు పెన్షన్, దీర్ఘకాలిక పొదుపు లాభాలను పూర్తిగా పొందలేకపోతున్నారు.

ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వేతన పరిమితిని రూ. 25 వేల వరకు పెంచాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదన త్వరలోనే EPFO యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన Central Board of Trustees (CBT) సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అవసరమైన ఆమోదాలు లభిస్తే.. ఈ కొత్త నిబంధనను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి సుప్రీంకోర్టు సూచనలు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ. 15 వేల వేతన పరిమితి 2014లో నిర్ణయించారు. అప్పటి నుంచి దేశంలో వేతనాలు, జీవన వ్యయం, ఉద్యోగ స్వరూపం గణనీయంగా మారాయి. అయినప్పటికీ EPFO నిబంధనల్లో మార్పులు జరగకపోవడంతో.. వాస్తవ పరిస్థితులకు ఇవి సరిపడట్లేదని కోర్టు అభిప్రాయపడింది. అందుకే వేతన పరిమితిని పెంచాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది.
ఈ మార్పు అమలైతే ఉద్యోగులపై పలు విధాలుగా ప్రభావం పడుతుంది. మొదటిగా EPFO పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల ప్రావిడెంట్ ఫండ్ నిధుల పరిమాణం మరింత బలపడుతుంది. దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా సహకరిస్తుంది. ఇక రెండవది ఉద్యోగుల జీతాల నుంచి PF, EPS కట్టింపులు కొంత పెరుగుతాయి. దీని వల్ల నెలవారీ చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గవచ్చు. అయితే, దీర్ఘకాలంలో చూస్తే ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రత, పెన్షన్ లాభాలు, పొదుపు సామర్థ్యాన్ని పెంచే అంశంగా మారుతుంది.
ఇక యజమానులపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. కంపెనీలు ఉద్యోగుల కోసం చెల్లించే సామాజిక భద్రతా కంట్రిబ్యూషన్లు పెరగవచ్చు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలపై ఖర్చు భారం పెరిగే అవకాశముంది. దీనికి తోడు, లేబర్ కోడ్స్, గ్రాట్యుటీ నిబంధనలు వంటి ఇతర కార్మిక చట్టాలతో కలిపి చూస్తే యజమానుల వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications