కేంద్రం ప్యాకేజీ, కరోనా వైరస్: మందగమనంపై ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే?
ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలు కొనసాగించాల్సి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కేంద్రం చర్యల నేపథ్యంలో పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయని, ప్రస్తుత మందగమనం నేపథ్యంలో కేంద్రం చర్యలు కొనసాగించాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, మరింత పటిష్టం కావాలన్నారు.

సానుకూల సంకేతాలు
మంగమనం నేపథ్యంలో ఆర్బీఐ కూడా 2019 క్యాలెండర్ ఇయర్లో వరుసగా ఐదుసార్లు వడ్డీ రేట్లు తగ్గించిందని దాస్ వెల్లడించారు. మందగమనం, నిరర్థక ఆస్తులు వంటి వివిధ కారణాలు ఇబ్బందికరంగా మారినట్లు తెలిపారు. కార్పోరేట్ వ్యవస్థ కూడా భారీగా రుణాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల ఉద్దీపనల నేపథ్యంలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

ఎంత వరకు ఫలితాలు ఉంటాయో..
ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో వృద్ధి రేటు 4.5 శాతంగా ఉండటంపై స్పందిస్తూ.. ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సానుకూల సంకేతాలు ఎంత వరకు ఫలితాలు ఇస్తాయో చూడాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పరిస్థితులు మెరుగుపడాలన్నారు. ప్రస్తుత సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 5 శాతానికి, 2020-21 సంవత్సరానికి 6 శాతానికి అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్ ప్రభావం ఉంటుంది
చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ పరిణామాలను ప్రతి విధాన నిర్ణేత జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని, తగిన తక్షణచర్యలు తీసుకోడానికి అవసరమని, అతిపెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థ చైనాలో వైరస్ సంక్షోభ ప్రభావం ప్రపంచ వృద్ధిపై ప్రతికూలత చూపుతుందన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, సహా ఇటీవల కేంద్రం తీసుకున్న మరికొన్ని కీలక చర్యలు డిమాండ్, వినియోగం పునరుద్ధరణ దిశలో తగిన సానుకూల పరిస్థితులను కల్పించాయని, మరిన్ని వ్యవస్థాగత చర్యలు అవసరమన్నారు.


Click it and Unblock the Notifications