PF News: ఉద్యోగుల వేతన పరిమితిపై కీలక నిర్ణయం..? EPFO సభ్యుల మీద తీవ్ర ప్రభావం..
Wage Ceiling: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగుల అభ్యున్నతి మరియు ఆర్థిక స్వావలంభన కోసం ప్రావిడెంట్ ఫండ్ ఉద్దేశించబడింది. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఉద్యోగులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం కోసం పెన్షన్ ఫండ్‌ను కూడా ఇందులో భాగం చేశారు. అయితే ఓ ఉద్యోగి పెన్షన్ స్కీమ్(EPS) లో సభ్యునిగా చేరడంలో అతని జీతం కీలక పాత్ర పోషిస్తుంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యుల వేతన పరిమితిని 15 వేల నుంచి 21 వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ప్రజల సామాజిక భద్రతను విస్తృతం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వేతన పరిమితిని పెంచే చర్యను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

వేతన పరిమితి పెంపునకు EPFO సభ్యులు చాలా కాలంగా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి 2014లో ప్రభుత్వం చివరిసారి సవరణ చేసింది. EPF కింద జీత పరిమితిని 6 వేల 500 నుంచి 15 వేలకు పెంచింది. కాగా మరోసారి పెంపు నిర్ణయం సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ మరోవైపు ఇది ప్రభుత్వానికి కూడా భారం కానుంది. దీంతో ఈ అంశం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం పెండింగ్‌లో ఉంది.
EPFO సభ్యులు సాధారణంగా తమ వేతనంలో 12 శాతాన్ని ప్రావిడెంట్ ఫండ్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తారు. అంతే మొత్తాన్ని యజమానులు కూడా వాటాగా అందిస్తారు. ఇందులో ఉద్యోగి చందా మొత్తం PFకు జమ అవుతుంది. కానీ యజమాని వాటాలో 8.33 శాతం పెన్షన్ స్కీమ్‌లో మిగిలినది PF ఖాతాకు బదిలీ అవుతుంది. ఇప్పుడు గరిష్ఠ పరిమితి పెరిగితే పెన్షన్ ఫండ్‌కు జమయ్యే 8.33 శాతాన్ని కొత్త పరిమితిని 21 వేలపై లెక్కిస్తారు.


Click it and Unblock the Notifications