కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు, కంపెనీలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా ఐటీ కంపనీలు తమ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఇంతకుముందు జూలై 31వ తేదీ వరకు ఉంది. దీనిని మరో ఐదు నెలల పాటు పొడిగించింది.

కార్యాలయాలకు వెళ్లడం ఇబ్బందికరం
వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోంను డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించినట్లు డాట్ (డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్- DoT) మంగళవారం రాత్రి ట్వీట్ చేసింది. ప్రస్తుతం కంపెనీని బట్టి 85 శాతం నుండి 90 శాతం మంది టెక్కీలు ఇంటి నుండి పని చేస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయాలకు వెళ్లి పని చేయడం ఇబ్బందికరంగా ఉంది. కరోనా వెలుగు చూడటంతో డాట్ తొలుత ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. ఆ తర్వాత జూలై 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ ఏడాది చివరి వరకు వెసులుబాటు కల్పించింది.

స్వాగతించిన ఐటీ
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును పొడిగించడాన్ని నాస్కామ్ అధ్యక్షులు స్వాగతించారు. డాట్‌కు, కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విప్రో చైర్మన్ రిషద్ బెనర్జీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వం సహకరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. మొదటి నుండి ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. మరో ఆరు నెలల సడలింపు తక్షణ ప్రాధాన్యతలను పరిష్కరించడానికి తోడ్పడిందన్నారు.

ఆ ఖర్చులు తగ్గి, ఇవి పెరిగాయి
కాగా చాలా ఐటీ కంపెనీలు మిశ్రమ వర్కింగ్ మోడల్‌కు మారుతున్నాయి. క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు 2025 నాటికి 75 శాతం వర్క్ ఫ్రమ్ ఉండాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా 90 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. కరోనా తర్వాత కార్యాలయాలకు వచ్చినప్పటికీ ఐటీ కంపెనీలు ఉద్యోగులను క్రమంగా ఇంటికి పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌తో ఉద్యోగుల ప్రయాణ భారం తగ్గడంతో పాటు కంపెనీలకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇప్పటికే జూన్ క్వార్టర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రయాణ ఖర్చులు 86 శాతం తగ్గినట్లుగా భావిస్తున్నారు. కమ్యూనికేషన్ బిల్లులు మాత్రం 20 శాతం నుండి 30 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications