భారత్‌లో మరో బంగారు గనిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. తవ్వేకొద్ది టన్నుల కొద్దీ పసిడి బయటకు..
ఇండియాకు మరోసారి బంగారు అదృష్టం దక్కింది. తాజాగా ఒడిశా రాష్ట్రంలో భారీ బంగారం నిల్వలు బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) చేసిన పరిశోధనలో కనీసం 4 జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తంగా 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది వెలుగులోకి రాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు మొదలు పెట్టాయి. చరిత్రలో తొలిసారిగా ఒడిశాలో గోల్డ్ బ్లాక్ వేలం జరగబోతోందన్న వార్త పెట్టుబడిదారుల్లో ఆసక్తి కలిగించింది.

GSI చేసిన సర్వే ప్రకారం, దేఓఘర్, సుందర్గఢ్, నబరంగపూర్, కేయోంఝార్, అంగుల్, కొరాపుట్ జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు ఖచ్చితంగా తేలింది. అదనంగా మయూర్భంజ్, మల్కాంగిరి, సంబల్పూర్, బౌఢ్ జిల్లాల్లో కూడా బంగారం ఉందా అన్న దానిపై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి.
2025 మార్చిలో ఒడిశా అసెంబ్లీలో మైన్స్ మినిస్టర్ బిభూతి భూషణ్ జెనా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సరైన లెక్కలు బయటపెట్టలేదు. కానీ ప్రాథమిక జియోలాజికల్ రిపోర్టుల ఆధారంగా 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం నిల్వలు ఉండొచ్చని అంచనా.
భారత్ ప్రతి సంవత్సరం 700-800 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి చేస్తుంది. దేశీయ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. 2020లో కేవలం 1.6 టన్నులు మాత్రమే అంటే ఒడిశాలో కనుగొన్న నిల్వలు ఇండియాలోని మొత్తం డిమాండ్‌ను తీర్చలేవు. కానీ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.
ఒడిశా ప్రభుత్వం, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (OMC), GSI కలిసి ఈ బంగారం వనరులను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు మాత్రం వేగవంతం చేశాయి. మొదటి గోల్డ్ మైనింగ్ బ్లాక్ వేలం మాత్రం దేఓఘర్ జిల్లాలో జరగనుంది. ప్రస్తుతానికి GSI, G3 ప్రాథమిక సర్వే నుంచి G2 డీటైల్ డ్రిల్లింగ్, నమూనా సేకరణ దశకు వెళ్తోంది. దీని ద్వారా బంగారం ఎంత నాణ్యంగా ఉందో, తవ్వకం చేయడం సాధ్యమా కాదా అనేది అంచనా వేస్తారు.
ఒడిశాలో ఈ బంగారం నిల్వలు నిజమని రుజువైతే, రాష్ట్రానికి మరియు దేశానికి కొత్త ఆర్థిక అవకాశాలు తెరుచుకోవచ్చు. మైనింగ్, రవాణా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. అలాగే బంగారం దిగుమతులపై ఆధారం కొంతవరకు తగ్గి, దేశానికి ఇంపోర్ట్ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒడిశా ఇప్పటికే క్రోమైట్ (96%), బాక్సైట్ (52%), ఇనుప ఖనిజం (33%) ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు బంగారం కూడా కొత్త ఆకర్షణగా మారితే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది.
ఈ బంగారం నిల్వలను వినియోగంలోకి తేవాలంటే ముందుగా జియోలాజికల్ సర్వే పూర్తి చేసి, ల్యాబ్ టెస్టులు చేయాలి. ఆ తర్వాత సాంకేతిక కమిటీలు మైనింగ్లను పరిశీలించాలి. గోల్డ్ మైనింగ్ అనుమతుల కోసం MMDR చట్టం ప్రకారం పారదర్శకంగా బ్లాక్‌లను వేలం వేయాలి. అలాగే పర్యావరణం, స్థానిక సమాజాలపై పడే ప్రభావాలను అంచనా వేసి రిపోర్టులు సిద్ధం చేయాలి. మైనింగ్ కార్యకలాపాలను విజయవంతంగా నడిపించడానికి రోడ్లు, విద్యుత్, నీరు, రవాణా వంటి మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఒడిశాలో బంగారం భారత్ మొత్తానికి బంగారం దిగుమతుల సమస్యను పరిష్కరించకపోయినా, దేశీయ వనరుల వినియోగం, ప్రాంతీయ అభివృద్ధి, స్థానిక ప్రజలకు ఉపాధి పరంగా గొప్ప అవకాశం.


Click it and Unblock the Notifications