భారీగా పెరిగిన బంగారం ధర, రూ.53,500 దిశగా: అక్కడ 2000 డాలర్ల సమీపానికి
బంగారం, వెండి ధరలు సోమవారం (ఏప్రిల్ 18) భారీగా పెరిగాయి. గతవారం ఓ సమయంలో రూ.53,000కు కాస్త దిగువన ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు మాత్రం రూ.53,500 దిశగా పరుగు పెడుతోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో ఉదయం గం.10.45 సమయానికి రూ.412 పెరిగి రూ.53,404 వద్ద ట్రేడ్ అయింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.408 లాభపడి రూ.53,635 వద్ద ట్రేడ్ అయింది. దాదాపు 0.8 శాతం మేర లాభపడ్డాయి.

వెండి రూ.900 జంప్
వెండి ధరలు దాదాపు రూ.900 పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.870 లేదా 1.26 శాతం ఎగిసి రూ.69,902 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.853 లేదా 1.22 శాతం ఎగిసి రూ.70,600 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.2800 మాత్రమే తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000కు అడుగు దూరంలోనే ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2000 డాలర్లను సమీపించాయి. నేడు ఈ వార్త రాసే సమయానికి 11 డాలర్లు లాభపడి 1986 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో ఓ సమయంలో 1989 డాలర్లను తాకింది. క్రితం సెషన్‌లో 1975 డాలర్ల వద్ద ముగిసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ఓ సమయంలో 1920 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ కొద్ది రోజుల్లో తిరిగి 2000 డాలర్ల దిశగా కనిపిస్తోంది. ఆల్ టైమ్ గరిష్టంతో కేవలం 90 డాలర్లు మాత్రమే తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్లు క్రాస్ చేసింది. 0.352 డాలర్లు లేదా 1.37 శాతం ఎగిసి 26.052 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 2000 డాలర్ల వద్ద బంగారానికి నిరోధకం కనిపిస్తోంది.

అందుకే బంగారం జంప్
రష్యా-ఉక్రెయిన్ మధ్య తిరిగి ఉద్రిక్తతలు కనిపిస్తున్న సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అమెరికా ద్రవ్యోల్భణం భారీగా పెరిగింది. చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 100 డాలర్ల దిగువకు పడిపోయిన క్రూడ్ ఇటీవల తిరిగి 112 డాలర్లను క్రాస్ చేసింది. ఈ ఆందోళనలు కూడా పసిడి మార్కెట్‌కు ఊతమిచ్చాయి. బంగారం వరుసగా రెండో వారం లాభాల్లో కొనసాగుతోంది. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications