రూ.700కు పైగా తగ్గిన బంగారం ధర, డాలర్ ఎఫెక్ట్‌తో అక్కడ అలా.. ఇక్కడ ఇలా
బంగారం ధరలు ఈరోజు(ఆగస్ట్ 20, గురువారం) మరింతగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) రూ.52,000 దిగువకు పడిపోయాయి. అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.51,909, సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.52,089 పలికింది. డిసెంబర్ డెలివరీ దాదాపు రూ.700 తగ్గి రూ.52,124 పలికింది. ఈ రెండింటి ధరలు కూడా 1.4 శాతం మేర క్షీణించాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ.900కు పైగా పడిపోయి రూ.66 వేల పైన పలికింది. బంగారం ఇంట్రాడే లో అత్యధికంగా రూ.52,550, కనిష్టం రూ.51,721 పలికింది. బంగారం ధరలు రెండు రోజుల్లో రూ.1600 వరకు తగ్గింది.

ముంబై మార్కెట్లో బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై బులియన్ మార్కెట్లో పసిడి 10 గ్రాములు రూ.1,075 క్షీణించి రూ.52,319 పలికింది. డాలర్ వ్యాల్యూ బలపడటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండటం వంటి వివిధ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీపై యూఎస్ ఫెడ్ ఆందోళన వ్యక్తం చేయడం కూడా మార్కెట్లపై దెబ్బపడింది. ముంబైలో 10 గ్రాముల 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.39,239, రూ.47,924, రూ.52,319గా ఉన్నాయి.

హైదరాబాద్, విజయవాడల్లో ఎంతంటే
హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల పసిడి నిన్న రూ.56,240 ఉండగా, ఈ రోజు రూ.800 వరకు తగ్గి రూ.55,460 పలికింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.51,560 నుండి రూ.700కు పైగా తగ్గి రూ.50,840 పలికింది. చెన్నైలో 24 గ్రాముల పసిడి రూ.55,460 ఉండగా, 22 క్యారెట్లు రూ.50,840 పలికింది.

అందుకే అక్కడ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు అంతకుముందు సెషన్‌లో 3 శాతం పడిపోయాయి. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా, అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరిగిందని వార్తలు రావడం, ఎకానమీపై ఫెడ్ రిజర్వ్ ఆందోళన నేపథ్యంలో తాజాగా స్పాట్ గోల్డ్ తిరిగి కాస్త పుంజుకున్నాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి 1937 వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 1.3 శాతం పడిపోయి 1944.20 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో పసిడి ధరలు ట్రాయ్ ఔన్స్ 1920 నుండి 1975 రేంజ్‌లో ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications