Gold@రూ.51,000! భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి ఏకంగా రూ.2,500 జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు పెరిగాయి. శుక్రవారం రాత్రి ముగింపు సమయానికి 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 1.28 శాతం లేదా రూ.642 పెరిగి రూ.50,817 పలికింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.793 పెరిగి రూ.50,959కి పెరిగింది. డిసెంబర్ ఫ్యూచర్స్ నిన్న రూ.50,300 వద్ద ప్రారంభమై రూ.50,817 వద్ద ముగిసింది. ఓ సమయంలో రూ.50,970 గరిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.50,710 వద్ద ప్రారంభమైంది. రూ.51,072 గరిష్టాన్ని తాకింది. రూ.50,959 వద్ద ముగిసింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం తిరిగి రూ.51వేలను తాకింది.

రూ.51వేల సమీపంలో పసిడి
ఆగస్ట్ 7 ఆల్ టైం గరిష్టం రూ.56,200తో పసిడి ధర రూ.5,000కు పైగా తక్కువ ఉంది. చాలా రోజులకు పసిడి రూ.51వేల మార్క్‌ను తాకింది. ఇక, వెండి డిసెంబర్ ఫ్యూచర్ కిలో ఏకంగా రూ.2,365 (3.91 శాతం) పెరిగి రూ.62,884.00 వద్ద ముగిసింది. మార్చి ఫ్యూచర్స్ రూ.2,545.00 (4.09 శాతం) పెరిగి కిలో రూ.64,727.00 వద్ద ముగిసింది. ఆగస్ట్ రెండో వారం నుండి భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, నాలుగు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రూ.50వేల దిగువకు వచ్చిన పసిడి ఇప్పుడు రూ.51వేలకు సమీపంలో ఉంది.

కామెక్స్‌లోను భారీ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 2.18 శాతం పెరిగి 1,936 డాలర్లు తాకింది. కామెక్స్‌లో 1,898.10 డాలర్ల నుండి 1,936.80 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. చివరకు 1,936.40 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు రోజు క్లోజింగ్ 1,895 డాలర్లతోపోలిస్తే 41 డాలర్లకు పైగా పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 1.55 శాతం పెరిగి ఔన్స్ 24.21 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

నిరోధకస్థాయి..
అంతర్జాతీయ మార్కెట్లో 1912 డాలర్లను అధిగమించడంతో 1939 డాలర్ల వద్ద నిరోధకస్థాయి ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
అనిశ్చితిలో పడిన కరోనా ఆర్థిక ప్యాకేజీపై చర్చలు తిరిగి ప్రారంభం కావడంతో అమెరికా స్టాక్స్ బలపడ్డాయి. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ బలహీనపడింది. ఎన్నికలు ముగిసే వరకు ప్యాకేజీపై చర్చలు లేవని తొలుత ప్రకటించిన అధ్యక్షులు ట్రంప్ ఆ తర్వాత చర్చకు మొగ్గు చూపారు. దీంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications