దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు ప్రభుత్వం కొత్త కంచె వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి (Gold silver) వస్తువులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠినమైన ఆంక్షలు విధించింది. గురువారం ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను (FTAs) అడ్డుపెట్టుకొని జరుగుతున్న కొన్ని అవకతవకలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆంక్షలు దేనిపై ఉన్నాయి?
తాజా నిబంధనల ప్రకారం.. కేవలం ముడి బంగారం, వెండి మాత్రమే కాకుండా ప్లాటినం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇమిటేషన్ జ్యువెలరీ , నాణేలపై కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. ఇప్పటివరకు ఏవైనా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నా, పేమెంట్లు చేసినా, లేదా షిప్‌మెంట్ తయారీలో ఉన్నా సరే.. ఈ కొత్త రూల్స్ నుంచి మినహాయింపు ఉండదని ప్రభుత్వం ఖరాకండిగా చెప్పేసింది. అంటే, ఇకపై ఈ వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్సు లేదా అనుమతి తప్పనిసరి.
ఎందుకు ఈ నిర్ణయం?
భారతదేశానికి ఆగ్నేయాసియా దేశాల కూటమి (ASEAN) తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి కొంతమంది వ్యాపారులు తక్కువ పన్నుతో బంగారం, వెండి (Gold silver) వస్తువులను భారత్‌కు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి రాళ్లు పొదగని సాధారణ నగలను దిగుమతి చేసుకుంటూ, పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అక్రమ మార్గాలకు అడ్డుకట్ట వేసి, దేశీయ పరిశ్రమను కాపాడటానికి ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్‌లో ప్లాటినంపై, సెప్టెంబర్‌లో వెండిపై విడివిడిగా ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఇప్పుడు అన్ని రకాల విలువైన లోహాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి నియంత్రణలోకి తెచ్చింది.
సామాన్యులకు కలిగే ఇబ్బందులు ఏంటి?
ఈ నిర్ణయం వల్ల మార్కెట్‌లో బంగారం , వెండి సరఫరాపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరిగే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం లైసెన్సింగ్ ప్రక్రియను సులభతరం చేస్తే, నిజాయితీగా వ్యాపారం చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి చౌకగా దిగుమతి అయ్యే నాణ్యత లేని నగల కంటే, దేశీయంగా తయారయ్యే ఆభరణాలకు ఈ నిర్ణయం వల్ల ఊతం లభించనుంది.
మొత్తానికి, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే దిగుమతి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ "బిగ్ మూవ్" భవిష్యత్తులో పసిడి మార్కెట్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications