భారీగా షాకిచ్చిన బంగారం, ఒకేరోజు ఏకంగా రూ.2,000 పెరుగుదల: రూ.46,000కు సమీపంలో..
కరోనా మహమ్మారి నేపథ్యంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తితో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో పసిడి భారంగా మారుతోంది. షేర్ మార్కెట్ నుంచి వైదొలగుతున్న ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. బంగారం సహా అతి ఖరీదైన మెటల్స్ ధరలు పెరుగుతున్నాయి.

రూ.2,000 పెరిగి రూ.45,724కు బంగారం
బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 7) భారీగా పెరిగాయి. 10 గ్రాములకు ఏకంగా దాదాపు రూ.2,000 ఎగిసింది. ఫ్యూచర్ మార్కెట్లో రూ.45,724 పలికి సరికొత్త రికార్డుకు చేరుకుంది. గత మార్చి నెలలోనే బంగారం రూ.45 మార్క్ దాటింది. ఆ తర్వాత రూ.40 వేల దిగువకు పడిపోయింది. ఈ ఇరవై రోజుల్లో మళ్లీ రికార్డ్ ధరను దాటింది.

ఎంసీఎక్స్‌లో ధర
ఎంసీఎక్స్‌లో ఈ రోజు జూన్ ఫ్యూచర్స్ 3.5 శాతం పెరిగి రూ.45,269 పలికింది. వెండి ధర కూడా ఎంసీఎక్స్‌లో 5 శాతం పెరిగి కిలో రూ.43,345గా ఉంది. నిన్న బంగారం ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ 480 పెరిగి రూ.43,720కు ఎగబాకింది. కిలో వెండి రూ 1439 పెరిగి రూ 41,311కి చేరుకుంది. కరోనా సంక్షోభ నేపథ్యంలో కరెన్సీలు, షేర్ల కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మెరుగైన రాబడి అందిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో 3 శాతం పెరిగి, 0.2 శాతం తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో నేడు బంగారం ధర ఔన్స్ 0.2 శాతం తగ్గి 1,657.67 డాలర్లు పలికింది. ఇంతకుముందు సెషన్లో బంగారం ధరలు 3 శాతం పెరిగాయి. ఇతర ఖరీదైన లోహాలు ప్లాటినం ఔన్స్ ధర 735.26, వెండి 14.99 పలికింది.

హైదరాబాద్‌లో ఎంతంటే
ప్రస్తుతం భాగ్యనగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,040, 22 క్యారెట్ల పసిడి ధర రూ.40,040 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీ కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లు ముందు రోజు పెరిగాయి. కానీ నేడు అతి స్వల్పంగా తగ్గి ఔన్స్ బంగారం ధర 1,657.67 డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications