అమ్మో.. బంగారం: రూ.1,000 పెరిగిన పసిడి, రూ.3,500 పెరిగిన వెండి, దిద్దుబాటు ఉంటుందా?
బంగారం ధరలు రికార్డ్ ధరలు పలుకుతున్నాయి. గత వారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో జీవనకాల గరిష్టానికి చేరుకుంది. ఈ రోజు (జూలై 27, సోమవారం) 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతం లేదా రూ.1,000 ఎగిసి రూ.52127 పలికింది. వెండి ధర కూడా కిలో 5.5 శాతం లేదా రూ.3,500 ఎగిసి రూ.64,999 పలికింది. గత వారం బంగారం 4 శాతం, వెండి 15 శాతం జంప్ చేసింది. ఈ రోజు ఒక్కరోజే బంగారం 2 శాతం, వెండి దాదాపు 6 శాతం పెరగడం గమనార్హం.

మరింతగా పెరిగే అవకాశం
వచ్చేవి పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయని, మరింతగా పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈరోజు పసిడి ప్రారంభంలోనే రూ.714 భారీ లాభంతో ప్రారంభమైంది. మధ్యాహ్నం రూ.1000 లాభపడింది. మార్చి నెలలో రూ.40వేలలోపు ఉన్న బంగారం ఇప్పుడు ఏకంగా రూ.55వేల సమీపానికి చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం రూ.54,300 పలికింది. అంతకుముందు రోజు రూ.53,500గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో.. ఆ మార్క్ దాటేసింది
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. డాలర్ వ్యాల్యూ పడిపోవడం, కేంద్రబ్యాంకులు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం వంటి వివిధ కారణాలతో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1.7శాతం పెరిగి 1,934 డాలర్లు పలికింది. ఓ సమయంలో ఔన్స్ ధర 1,943 డాలర్లు పలికింది. 2011 సెప్టెంబర్ నాటి గరిష్టం 1,920.30 డాలర్లు దాటింది.

దిద్దుబాటును కొట్టిపారేయలేం
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1900 నుండి 1917 డాలర్ల వద్ద ఎదురయ్యే బలమైన రెసిస్టెన్స్‌ను తాజాగా దాటడంతో స్వల్ప కాలంలో 2000 డాలర్లకు చేరే వీలుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తక్కువ కాలంలోనే దిద్దుబాటుకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ పసిడి ధరలు వేగంగా పతనమైతే కొనుగోళ్లు చేయవచ్చునని సూచిస్తున్నారు. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా అక్టోబర్, నవంబర్ వరకు ఔన్స్ బంగారం 2,300 డాలర్లకు, వెండి 29 డాలర్లు దాటిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications