బంగారం, వెండి ధరలు నేడు(ఆగస్ట్ 18) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.18 శాతం పెరిగి రూ.53,370 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.8 శాతం పెరిగి కిలో రూ.69,688 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం ధరలు 10 గ్రాములు 2 శాతం (రూ.1,033) పెరిగింది. క్రితం సెషన్‌లో వెండి కిలో 2.6 శాతం (రూ.1,750) పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే.

గరిష్టం నుండి రూ.3,000 తక్కువే
బంగారం ధరలు ఈ రెండు రోజుల్లో రూ.వెయ్యికి పైగా పెరిగినప్పటికీ గరిష్టం నుండి ఇంకా రూ.3,000 తక్కువే ఉంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.55,300కు పైగా పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 50,700 పలికింది. ఢిల్లీలో దాదాపు యథాతథంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పసిడి రూ.55 వేల పైకి చేరుకుంది. 22 క్యారెట్లు రూ.51,150గా ఉంది.

డాలర్ దెబ్బ.. మళ్లీ 2000 డాలర్లకు పసిడి
ఆగస్ట్ 7వ తేదీన 10 గ్రాముల పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,700 మార్క్ చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం భారీగా తగ్గిపోయిన బంగారం ధరలు ఔన్స్ 1,987.51 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత ఓ సమయంలో మళ్లీ 2000 డాలర్లకు చేరుకుంది. గత వారం భారీగా తగ్గి.. ఇప్పుడు మళ్లీ ఈ మార్క్ దాటడం గమనార్హం. డాలర్ వ్యాల్యూ స్వల్పంగా క్షీణించింది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా పసిడిపై ప్రభావం చూపింది. గతవారం కంటే డాలర్ వ్యాల్యూ 0.23 శాతం క్షీణించింది. వెండి ధర 1 శాతం పెరిగి ఔన్స్ 27.69 డాలర్లుగా, ప్లాటినమ్ 0.9 శాతం పెరిగి 957.73 డాలర్లుగా ఉంది.

రెండో ఏడాదిలో ధరలు ఎలా ఉంటాయో?
మందగమనం, కరోనా కారణంగా 2020 క్యాలెండర్ ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మొదటి అర్ధ సంవత్సరం అంతర్జాతీయంగా, దేశీయంగా అటుఇటుగా 30 శాతం వరకు పెరిగాయి. గత వారం హఠాత్తుగా 200 డాలర్ల మేర తగ్గింది. ఇప్పుడు క్రమంగా మరో 100 డాలర్లు పెరిగింది. అయితే రెండో అర్ధ సంవత్సరం ఎలా ఉంటుందనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. రష్యా వ్యాక్సీన్ తర్వాత మరిన్ని దేశాల వ్యాక్సీన్లు వస్తే, కరోనా ప్రభావం తగ్గితే బంగారం ధర తగ్గే అవకాశాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications